
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టులో ఇటీవల విశేషంగా రాణిస్తోన్న యువ హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్ ప్రసాద్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) గుర్తించింది. 2019 ఏడాదికిగానూ ఎఫ్‌ఐహెచ్ ‘ రైజింగ్ స్టార్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా మిడ్ ఫీల్డర్ వివేక్ సాగర్‌ను ఎంపిక చేసింది. ఈ అవార్డు కోసం పోటీపడిన వారిలో 19 ఏళ్ల వివేక్ సాగర్ విజేతగా నిలవగా... మైకో కాసెలా (అర్జెంటీనా), బ్లేక్ గోవర్స్ (ఆస్ట్రేలియా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ సందర్భంగా వివేక్ సాగర్‌ను హాకీ ఇండియా అధ్యక్షుడు మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ అభినందించారు. 2018లో 17 ఏళ్ల వయస్సులో వివేక్ సాగర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2019లో భువనేశ్వర్ వేదికగా జరిగిన ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ సిరీస్ ఫైనల్స్ గెలిచిన భారత జట్టులో అతను సభ్యుడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలోనూ వివేక్ సాగర్ కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment