‘భారత్‌, పాకిస్తాన్‌ లేకుంటే దానికి అర్థమే లేదు’ | Waqar Younis Unhappy On Test Championship Without PAK India | Sakshi
Sakshi News home page

టెస్టు చాంపియన్‌షిప్‌పై వకార్‌ యూనిస్‌ అసంతృప్తి

Published Wed, Mar 18 2020 8:41 AM | Last Updated on Wed, Mar 18 2020 8:52 AM

Waqar Younis Unhappy On Test Championship Without PAK India - Sakshi

కరాచీ: భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగుతుందంటే మ్యాచ్‌కు గంట నుంచే క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోయేవారు. ఇక స్టేడియానికి వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించే వారి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే, ప్రస్తుతం ఆ కిక్కు, మజా క్రికెట్‌ అభిమానులకు దూరమైంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో తప్ప ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య టెస్టు సిరీస్‌ లేకపోవడంపై పాకిస్తాన్‌ మాజీ పేసర్‌, ప్రస్తుత బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
(చదవండి: క్రికెటర్‌ హేల్స్‌కు కరోనా?)

‘ప్రస్తుతం భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య ద్వేషపూరిత వాతావరణం నెలకొని ఉందని నాకు తెలుసు. అయితే, దానిని క్రికెట్‌కు ఆపాదించరాదు. ఈ విషయంలో ఐసీసీ కాస్త చొరవ తీసుకొని ఇరు దేశాల మధ్య టెస్టు చాంపియన్‌షిప్‌లో ఒక సిరీస్‌ జరిగేలా షెడ్యూల్‌ రూపొందించాల్సింది. అధిక సంఖ్యలో ప్రేక్షకులు చూసే భారత్‌, పాకిస్తాన్‌ మధ్య టెస్టు సిరీస్‌ లేకుండా టెస్టు చాంపియన్‌షిప్‌కు అర్థమే లేదు’అని వకార్‌ వ్యాఖ్యానించాడు. చివరిసారిగా భారత్‌ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను మన జట్టు 1-0తో సొంతం చేసుకుంది. 2008 ముంబై దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

ఒకప్పటిలా ప్రస్తుతం భారత జట్టుకు పేసర్ల కొదువలేదని వకార్‌ అన్నాడు. 140 కి.మీ వేగంతో బంతులేసే నాణ్యమైన పేసర్లను భారత్‌ తయారు చేస్తుందని పేర్కొన్నాడు. ‘ఒకప్పుడు భారత్‌ బౌలింగ్‌ ఇంత పటిష్టంగా లేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ ఫమీ, ఇషాంత్‌ శర్మతో కూడిన వారి బౌలింగ్‌ లైనస్‌ ఎంతటి పటిష్ట బ్యాటింగ్‌నైనా కూల్చగలదు. ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో నెంబర్‌వన్‌గా ఉండటానికి గల కారణాల్లో బౌలింగ్‌ కూడా ఒకటి’అని వకార్‌ భారత్‌ బౌలింగ్‌ను ప్రశంసించాడు.
(చదవండి: టి20 ప్రపంచ కప్‌ నిర్వహణపై ఆసీస్‌ దృష్టి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement