వకార్ బహిరంగ క్షమాపణ; సీనియర్ల ఫైర్
కరాచీ: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పరాజయానికి బాధ్యత వహిస్తూ కోచ్ వకార్ యూనిస్ బహిరంగ క్షమాపణ చెప్పడంపై మాజీ కెప్టెన్లు భిన్నంగా స్పందించారు. క్షమాపణ చిన్న విషయమని, ఇప్పటికే ఆలస్యం చేశారని మాజీ కెప్టెన్లు రమీజ్ రాజా, మహ్మద్ యూసఫ్ వ్యాఖ్యానించారు. మీడియా ముందు వకార్ క్షమాపణ చెప్పడం బాధ కలిగించిందని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. వకార్ గొప్ప బౌలర్ అని, అతడు క్షమాపణ చెప్పే పరిస్థితి రావడం బాధాకమని పేర్కొన్నాడు. జట్టు ఓటమికి ఒక్కరే బాధ్యులు కారని, పాక్ క్రికెట్ టీమ్ లో చాలా అంశాలు మెరుగుపరచాల్సిన అవసరముందన్నాడు.
బోర్డు ఇచ్చిన స్వేచ్ఛను వకార్ ఉపయోగించుకోలేకపోయారని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రమీజ్ రాజా అన్నాడు. మూడేళ్ల నుంచి జట్టు ఆటతీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. కోచ్ గా వకార్ విఫలమయ్యారని విమర్శించారు. జట్టుకు నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా వకార్ క్షమాపణ చెప్పారని మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ ధ్వజమెత్తారు. రాహుల్ ద్రావిడ్ ను భారత జూనియర్ టీమ్ కు కోచ్ గా నియమించినట్టుగానే.. పాక్ జూనియర్ టీమ్ కు వకార్ ను కోచ్ నియమించాల్సిందని సూచించారు. పాకిస్థాన్ జట్టును సంస్కరించేందుకు విప్లవాత్మక, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు.