రబడ, డేవిడ్ వార్నర్
సాక్షి, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ తారస్థాయికి చేరడం.. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం.. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో కోత విధించడం తెలిసిన విషయమే. జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లు చెరొకటి గెలిచి సిరీస్‌లో సమంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 311 పరుగులకు కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. ముఖ్యంగా రెండు టెస్టుల్లో ఆసీస్ పతనాన్ని శాసించిన దక్షిణాఫ్రికా పేసర్ రబడపై వార్నర్ కసితీర్చుకున్నాడు. ఎదుర్కొన్న వరుస ఐదు బంతులను బౌండరికీ తరలించాడు.
రబడా వేసిన నాలుగో ఓవర్ చివరి మూడు బంతులను బౌండరీలకు పంపించిన వార్నర్.. ఆరో ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టాడు. రెండో బంతిని రబడా నోబాల్ వేయగా దాన్ని సైతం బౌండరీకి తరలించాడు. వార్నర్ దూకుడుతో మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇది టెస్టా.. టీ20 ఆ! అనే సందిగ్ధంలో ఉండగానే రబడ వార్నర్‌ను బౌల్డ్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment