దక్షిణాఫ్రికాతో చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయ లక్ష్యం 190 పరుగులు... 87 పరుగులు చేస్తే సెమీస్‌కు ఇంగ్లండ్... 10.4వ ఓవర్లో ఆ పరుగు వచ్చేసింది... 106 పరుగులు చేస్తే గ్రూప్‌లో అగ్రస్థానం... 12.1వ ఓవర్లో అదీ జరిగిపోయింది... 132 పరుగులు చేస్తే ఆసీస్‌కు సెమీస్ అవకాశం... 15.2వ ఓవర్లో ఆ స్కోరు రావడంతో కంగారూ టీమ్‌లో ఆనందం...చివరి మ్యాచ్‌లో గెలిచినా దురదృష్టం వెంటాడటంతో సఫారీ జట్టు మరోసారి ఐసీసీ టోర్నీ నుంచి ఉత్త చేతులతో నిష్క్రమించింది.
టి20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ గ్రూప్–1 టాపర్‌గా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా రన్‌రేట్ ఆధారంగా ఇంగ్లండ్‌కు అగ్రస్థానం దక్కగా... అదే తరహాలో మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచి ఆస్ట్రేలియా కూడా సెమీస్‌కు అర్హత పొందింది.
ఈ మూడు టీమ్‌లు 4 విజయాలు, 8 పాయింట్లతో సమానంగా నిలవగా... పోటీలో దక్షిణాఫ్రికా వెనకబడిపోయింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 85 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 13.3 ఓవర్లు తీసుకోవడం చివరకు దక్షిణాఫ్రికాను బాగా దెబ్బ తీసింది. తాజా ఫలితంతో సెమీస్‌లో పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా పోరు ఖాయమైపోయింది.
(చదవండి: T20 WC 2021: అతి పెద్ద సిక్స్ కొట్టిన రసెల్.. వీడియో వైరల్)
షార్జా: టోర్నీ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్‌కు చివరి లీగ్ మ్యాచ్‌లో చుక్కెదురైంది. శనివారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాన్ డర్ డసెన్ (60 బంతుల్లో 94 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుతంగా ఆడగా... మార్క్‌రమ్ (25 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా దూకుడైన అర్ధ సెంచరీ సాధించాడు. క్వింటన్ డి కాక్ (27 బంతుల్లో 34; 4 ఫోర్లు) కూడా రాణించాడు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు సాధించింది.
మొయిన్ అలీ (27 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ మలాన్ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, సిక్స్), లివింగ్ స్టోన్ (17 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్స్‌లు), బట్లర్ (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్), జేసన్ రాయ్ (15 బంతుల్లో 20 రిటైర్డ్‌హర్ట్; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు జోడించారు. కగిసో రబడ (3/48) ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొలి మూడు బంతులకు మూడు వికెట్లు (వోక్స్, మోర్గాన్, జోర్డాన్) తీసి ‘హ్యాట్రిక్’ సాధించడం విశేషం. అంతర్జాతీయ టి20ల్లో హ్యాట్రిక్ తీసిన తొలి దక్షిణాఫ్రికా బౌలర్‌గా రబడ గుర్తింపు పొందాడు.
(చదవండి: Harbhajan Singh: 'చెత్త వాగుడు ఆపండి'.. భజ్జీ వార్నింగ్)
వార్నర్ వీరవిహారం
అబుదాబి: ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడు మిచెల్ మార్ష్ (32 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అర్ధ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియాకు చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం దక్కింది.
ఈ పోరులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (31 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... ఎవిన్ లూయిస్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), హెట్‌మైర్ (28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
జోష్ హాజల్‌వుడ్ (4/39) విండీస్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు సాధించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన విండీస్ చివరకు ఒకే ఒక విజయంతో టోర్నీని ముగిచింది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు డ్వేన్ బ్రావో గుడ్‌బై చెప్పగా... క్రిస్ గేల్ కూడా తన ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ ఆడేశాడు.
(చదవండి: అజహరుద్దీన్-సంగీతల బ్రేకప్ లవ్‌స్టోరీ)
స్కోరు వివరాలు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (బి) కమిన్స్ 15; లూయిస్ (సి) స్మిత్ (బి) జంపా 29; పూరన్ (సి) మార్ష్ (బి) హాజల్‌వుడ్ 4; ఛేజ్ (బి) హాజల్‌వుడ్ 0; హెట్‌మైర్ (సి) వేడ్ (బి) హాజల్‌వుడ్ 27; పొలార్డ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 44; బ్రావో (సి) వార్నర్ (బి) హాజల్‌వుడ్ 10; రసెల్ (నాటౌట్) 18; హోల్డర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1–30, 2–35, 3–35, 4–70, 5–91, 6–126, 7–143. బౌలింగ్: స్టార్క్ 4–0–33–1, హాజల్‌వుడ్ 4–0–39–4, కమిన్స్ 4–0–37–1, మ్యాక్స్‌వెల్ 1–0–6–0, మార్ష్ 3–0–16–0, జంపా 4–0–20–1.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 89; ఫించ్ (బి) హొసీన్ 9; మిచెల్ మార్ష్ (సి) హోల్డర్ (బి) గేల్ 53; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–33, 2–157.
బౌలింగ్: హొసీన్ 4–0–29–1, రోస్టన్ ఛేజ్ 1.2–0–17–0, జేసన్ హోల్డర్ 2–0–26–0, డ్వేన్ బ్రావో 4–0–36–0, వాల్ష్ 2–0–18–0, ఆండ్రీ రసెల్ 2–0–25–0, గేల్ 1–0–7–1.
Comments
Please login to add a commentAdd a comment