![T20 WC: Aus Vs WI And Eng Vs SA Who Will Enter Semis After England - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/6/t20wc.jpg.webp?itok=fCP04WGe)
T20 WC 2021 Aus Vs WI And Eng Vs SA Who Will Enter Semis After England: టి20 ప్రపంచకప్ సూపర్–12 గ్రూప్–1 లీగ్ మ్యాచ్‌లకు నవంబరు 6తో తెరపడనుంది. వరుసగా నాలుగు విజయాలతో ఇంగ్లండ్ ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా... మరో సెమీఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడనున్నాయి. శనివారం నాటి చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా... ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆరు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.
అయితే రన్‌రేట్ విషయంలో దక్షిణాఫ్రికా (0.742)కంటే ఆస్ట్రేలియా (1.031) చాలా మెరుగ్గా ఉంది. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించినా ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్త్ అనేది రాత్రి ఇంగ్లండ్–దక్షిణాఫ్రికా మ్యాచ్ ముగిసిన తర్వాతే ఖరారవుతుంది. విండీస్‌పై ఆస్ట్రేలియా గెలిచినా... ఆసీస్ జట్టు రన్‌రేట్‌ను దాటి ముందుకెళ్లాలంటే ఎంత తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గాల్సి ఉంటుందో దక్షిణాఫ్రికాకు తెలుస్తుంది.
ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తమ మ్యాచ్‌ల్లో గెలిస్తే ఇంగ్లండ్‌తో సమంగా ఎనిమిది పాయింట్లతో నిలుస్తాయి. అయితే ఇంగ్లండ్ రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉండటంతో ఆ జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదు. ఈ పరిస్థితిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టుకు రెండో సెమీస్ బెర్త్ లభిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండు జట్లూ తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోతే రన్‌రేట్ ఆధారంగానే రెండో సెమీస్ బెర్త్ ఖరారుకానుంది.
జంపా మ్యాజిక్...
బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా (5/19) మాయాజాలానికి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. ఆ్రస్టేలియా కేవలం 6.2 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 78 పరుగులు చేసి గెలిచింది. 89 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించడంతో ఆస్ట్రేలియా రన్‌రేట్ –0.627 నుంచి 1.031కు ఎగబాకడం విశేషం. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఓటమితో బంగ్లాదేశ్ సూపర్–12 దశలో ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది.
శ్రీలంక... విజయంతో ముగింపు
గ్రూప్–1లోనే భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక 20 పరుగుల ఆధిక్యంతో రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తమ టి20 ప్రపంచకప్‌ను విజయంతో ముగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు సాధించింది. ఓపెనర్ నిశాంక (41 బంతుల్లో 51; 5 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చరిత్ అసలంక (41 బంతుల్లో 68; 8 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు.
అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసి ఓడిపోయింది. గేల్ (1), లూయిస్ (8), రసెల్ (2), పొలార్డ్ (0), డ్వేన్ బ్రావో (2) విఫలమయ్యారు. నికొలస్ పూరన్ (34 బంతుల్లో 46; 6 ఫోర్లు, సిక్స్)... హెట్‌మైర్ (54 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. లంక బౌలర్లలో బినూరా ఫెర్నాండో, చమిక కరుణరత్నే, హసరంగ రెండేసి వికెట్లు తీశారు.
చదవండి: T20 world Cup 2021: 6.3 ఓవర్లలోనే కొట్టేశారు.. అయిననూ సెమీస్ ఆశలన్నీ అఫ్గనిస్తాన్‌పైనే!?
Comments
Please login to add a commentAdd a comment