ఇప్పటికైనా ‘టాప్’లో చేర్చండి!
ప్రభుత్వ మద్దతు కోరుతున్న గుత్తా జ్వాల
తమ ప్రదర్శనను గుర్తించాలంటున్న షట్లర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే లక్ష్యంతో ఆటగాళ్లకు ఆర్థిక సహకారం అందిస్తూ ఇటీవల భారత ప్రభుత్వం టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పేరుతో భారీ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఆరుగురికి అవకాశం కల్పించగా... డబుల్స్ స్పెషలిస్ట్‌లు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు స్థానం లభించలేదు. అయితే తాజాగా కెనడా గ్రాండ్‌ప్రి టోర్నీ నెగ్గిన అనంతరం గుత్తా జ్వాల ఇప్పటికైనా తమను గుర్తించాలని, ప్రభుత్వ సహకారం ఉంటే తామూ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తామని చెప్పింది.
విజయానంతరం స్వస్థలం తిరిగొచ్చిన జ్వాల, బుధవారం మీడియాతో మాట్లాడింది. ‘సింగిల్స్ ఆటగాళ్లలాగే మాకూ ప్రభుత్వం సహకారం అందించాలి. అది దక్కితే నేను, అశ్విని కచ్చితంగా ఒలింపిక్స్‌లో పతకం గెలుస్తాం. సంబంధిత వ్యక్తులు ఇప్పటికైనా మేల్కొనాలి. వారు మా గురించీ ఆలోచిస్తారని ఆశిస్తున్నా. డబుల్స్‌లో భారత్ తరఫున మాది అత్యుత్తమ జోడి. కాబట్టి అన్ని రకాల మద్దతు అవసరం. రెండు, మూడు రోజులు ఢిల్లీలో ఉండి పైరవీలు చేసుకోకుండా ఆటపై దృష్టి పెడుతున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదేమో. కెనడా ఓపెన్ తర్వాతైనా కేంద్ర క్రీడా శాఖ ఆలోచన మారాలి’అని జ్వాల ఘాటుగా వ్యాఖ్యానించింది.
మా జోడీ సూపర్ : చాలా కాలం తర్వాత అంతర్జాతీయ టైటిల్ గెలవడం పట్ల గుత్తా జ్వాల సంతోషం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ సన్నాహక సంవత్సరంలో ఇది రావడం తమ ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని, అశ్వినితో సమన్వయం బాగా కుదిరిందని చెప్పింది. ‘గత కొన్నేళ్లుగా మేం కలిసి ఆడుతున్నా... ఇటీవల కోర్టులో మా మధ్య సమన్వయం పెరగడం పట్ల ఇద్దరం సంతృప్తిగా ఉన్నాం. ఆటగాళ్లుగా ఇద్దరం ఎంతో పరిణతి సాధించాం. అనుభవం వల్లే కెనడా ఓపెన్‌లో విజయం దక్కింది. భవిష్యత్తులోనూ మంచి ఫలితాలు సాధిస్తాం. అయితే అంతిమ లక్ష్యం ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే’ అని జ్వాల వెల్లడించింది. టైటిల్ నెగ్గిన తర్వాత దేశ ప్రధాని మోది అభినందనలు అందుకోవడం గర్వంగా అనిపించిందని, ఇది తమ శ్రమకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు జ్వాల పేర్కొంది.