నికోలస్ పూరన్
నికోలస్ పూరన్.. వెస్టిండీస్ వికెట్ కీపర్ కమ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విండీస్ జట్టు నుంచి ఎగిసిపడిన మరో యువకెరటం. శ్రీలంకతో మ్యాచ్ వరకు పెద్దగా పరిచయంలేని ఆటగాడు. ఆ మ్యాచ్‌లో ఓవైపు వికెట్లు పడుతున్నా కడవరకు పోరాడిన శతకవీరుడు. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ పూరన్ ఓ పడిలేచిన కెరటం. అతని వెనుక పుట్టెడు దుఃఖం ఉంది. 7 నెలలు మంచానికే పరిమితమైన విషాద గాధ ఉంది.
2015లో ట్రినిడాడ్‌లో రోడ్డుప్రమాదానికి గురైన పూరన్.. సుమారు 7 నెలలు మంచానికే పరిమితమయ్యాడు. ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరగడమే కాక నడుం కింది భాగం చచ్చుబడిపోయింది. అయితే, ఈ ప్రమాదం అతడి క్రికెట్ జీవితాన్ని అనిశ్చితిలో పడేసినా, తిరిగి క్రికెట్ ఆడాలన్న అతడి దృఢసంకల్పాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయింది. పలు సర్జరీలు, ఫిజియోథెరపీ తర్వాత ఆ ఏడాది జూలైలో మెల్లిగా నడక మొదలు పెట్టాడు. నెల తిరిగే సరికి పరుగెత్తడం ప్రారంభించాడు. తిరిగి బ్యాట్ పట్టి ఒక్కో అడుగు వేసుకుంటూ, ఒక్కో పరుగు సాధిస్తూ పూర్తి ఫిట్‌నెస్ సాధించి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
నేను క్రికెట్ ఆడగలనా?
ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రమాద ఘటన విషయాలను తెలియజేసిన పూరన్.. తనకు స్పృహ వచ్చిన తర్వాత తన నోట వచ్చిన మొదటి మాట.. ‘డాక్టర్స్..నేను క్రికెట్ ఆడగలనా?’ అని ప్రశ్నించినట్లు నాటి భయంకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ‘నా శిక్షణను ముగించుకొని కారులో నేనే డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరాను. మా ఇంటికి దగ్గరకు రాగానే నా కారును మరో కార్ ఓవర్‌టేక్ చేస్తూ వెళ్లడంతో నేను కొంచెం దూరంగా వెళ్లాను. కానీ నా కారు ఇసుక కుప్పను తాకింది. నేను కారులో నుంచి బయటపడగానే మరో వాహనం నన్ను ఢీకొట్టింది. ఆ తర్వాత నాకేం జరిగిందో గుర్తులేదు. నాకు స్పృహ రాగానే.. షాక్‌కు గురయ్యాను. నన్ను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. ప్రమాదం జరిగిందని గ్రహించాను. కానీ ఎలా జరిగిందో తెలియడం లేదు. కాళ్లు కదలడం లేదు. అందరూ కాళ్ల వేళ్లు కదిలించమని చెబుతున్నారు. కానీ నేను నా మోకాలిని కూడా కదలించలేకపోతున్నాను. ఎదో తప్పు జరిగిందని గ్రహించాను. వెంటనే డాక్టర్లను నేను క్రికెట్ ఆడగలనా? అని అడిగాను’ అని పూరన్ తన ప్రమాదం గురించి చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విండీస్ జట్టులో చోటు దక్కించుకున్న ఈ 23 ఏళ్ల క్రికెటర్.. తొలి ప్రపంచకప్‌లోనే ఇంగ్లండ్‌పై హాఫ్ సెంచరీ.. శ్రీలంకతో సెంచరీ.. అఫ్గాన్‌పై అర్థ సెంచరీతో అదరగొట్టాడు. మిడిలార్డర్‌లో విండీస్ జట్టుకు వెన్నెముకలా మారాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జట్టును గెలిపించేంత పనిచేశాడు. 103 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 118 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చాడు. జట్టు ఓడినా అతడి ఆట తీరుకు యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అయ్యింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ అనంతరం పూరన్ మాట్లాడుతూ..‘ఈ టోర్నీలో మేం అంతగా రాణించలేకపోవచ్చు. కానీ ఓ ఆటగాడు విజయం కన్నా ఓటమితోనే ఎక్కువ నేర్చుకుంటాడు. మేం కూడా ఈ టోర్నీ ద్వారా చాలా నేర్చుకోవడంతో పాటు అనుభవాన్ని సంపాధించాం. మాది యువ జట్టు. నాలాగే హెట్‌మైర్,హోప్, అలెన్‌లు చాలా నేర్చుకున్నారు’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో విండీస్ అభిమానులు.. పూరన్‌ను దిగ్గజం బ్రయాన్ లారాతో పోల్చడం మొదలుపెట్టారు. కానీ పూరన్ మాత్రం ఎవరితో పోల్చోకోదల్చుకోలేదని, తనలానే ఉంటానని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment