
గవాస్కర్ కోసం బిస్కెట్లు పంపేవాళ్లం!
ముంబై: టెస్టు క్రికెట్లో పదివేల పరుగులు సాధించిన మొదటి క్రికెటర్ గా , అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 30కు పైగా సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్ ను సొంతం చేసుకున్న ఘనత భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ది. 1971లో మొదలైన గవాస్కర్ క్రికెట్ ప్రయాణం.. 1987 వరకూ కొనసాగింది. దాదాపు 16 ఏళ్ల గవాస్కర్ క్రికెట్ కెరీర్లో ఎన్నో ఘనతలను అతను సొంతం చేసుకున్నాడు. టెస్టు కెరీర్లో 34 సెంచరీలు, నాలుగు డబుల్ సెంచరీలు గవాస్కర్ సొంతం. సాంప్రదాయ టెస్టు క్రికెట్ను గవాస్కర్ శాసించాడంటే అతిశకియోక్తి కాదేమో.
ప్రత్యేకంగా ఫాస్ట్ బౌలింగ్కు మారుపేరైన వెస్టిండీస్ జట్టును గవాస్కర్ ఓ ఆట ఆడుకున్నాడు. తన అరంగేట్రం సిరీస్లోనే విండీస్ను ఊచకోత కోశాడు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఒక డబుల్ సెంచరీ సాయంతో 154.80 సగటుతో 774 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తన టెస్టు కెరీర్లో అత్యధిక స్కోరు కూడా వెస్టిండీస్పైనే గవాస్కర్ నమోదు చేయడం విశేషం. 1983లో మాల్కం మార్షల్, ఆండీ రాబర్ట్స్, మిచెల్ హోల్డింగ్లాంటి దిగ్గజ బౌలర్లను గడగడలాడించిన గవాస్కర్ 236 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించాడు.
ఇదిలా ఉంచితే గవాస్కర్ ఎప్పుడు విండీస్ పర్యటనకు వెళ్లినా భారత్ నుంచి బిస్కెట్స్ మాత్రం కచ్చితంగా వెళ్లాల్సిందేనట. గవాస్కర్ విండీస్ పర్యటనకు వెళ్లే ముందు ముంబై నుంచి గ్లూకోజ్ బిస్కెట్స్ను పంపించే వాళ్లమని ఆమె సోదరి నూతన్ గవాస్కర్ స్పష్టం చేశారు. ఆదివారం గవాస్కర్ 67వ వసంతంలోకి అడుగుపెట్టిన తరుణంలో అతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను నూతన్ వెల్లడించారు. ప్రత్యేకంగా పార్లే జీ గ్లూకోజ్ బిస్కెట్స్ అంటే గవాస్కర్ కు అత్యంత ఇష్టమని ఆమె పేర్కొన్నారు.
'మా అన్నయ్య విండీస్ పర్యటనకు వెళుతున్నాడంటే బిస్కెట్ల ప్యాకెట్లను ముందుగానే సిద్ధం చేసేవాళ్లం. పర్యటన షెడ్యూల్ ను బట్టి మూడు వారాల నుంచి నెల రోజుల వరకూ సరిపడా బిస్కెట్లను విండీస్కు పంపేవాళ్లం. జర్నలిస్టుల ద్వారా కానీ, అక్కడకు వెళ్లే తెలుసుకున్న వ్యక్తుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ బిస్కెట్లను చేరవేసే వాళ్లం. కాఫీ, టీ త్రాగేటప్పుడు బిస్కెట్లను తినడం సునీల్ కు ఇష్టం. అయితే ఇప్పుడు డయాబెటిస్ సమస్య వల్ల బిస్కెట్లను తినలేకపోతున్నానని మా అన్నయ్యకు కాస్త బాధగానే ఉంది. ఇప్పటికీ బిస్కెట్లను తినడానికి యత్నిస్తుంటాడు. వాటికి దూరంగా ఉంచేందుకు మేము ప్రయత్నిస్తున్నాం' అని నూతన్ తెలిపారు.