
సాక్షి క్రీడా విభాగం: విరాట్ కోహ్లి కూడా ఇక అండగా నిలవడం కష్టమని భావించాడా? మళ్లీ మళ్లీ మద్దతు పలకడం ఇబ్బందని రవిశాస్త్రికి కూడా తెలిసొచ్చిందా? ఎందుకంటే తాజా ఇంగ్లండ్ పర్యటనలో వన్డే సెంచరీ, టి20 సెంచరీ, ఐర్లాండ్‌పై 97 పరుగులు కూడా రోహిత్ శర్మకు టెస్టు జట్టులో స్థానం కల్పించడానికి సరిపోలేదు. టెస్టుల్లో రోహిత్ ఆటపై విమర్శలు వచ్చిన ప్రతీసారి భారత కెప్టెన్ అతడిని వెనకేసుకొచ్చాడు. మిడిలార్డర్‌లో దూకుడైన ఆటగాడు కావాలని, ఒక్క సెషన్‌లో వేగంగా మ్యాచ్‌ను మార్చేయగలడని చెబుతూ రోహిత్‌కు అవకాశాలు కల్పించాడు. అతని కోసం టెస్టు స్పెషలిస్ట్ పుజారా, నమ్మకమైన బ్యాట్స్‌మెన్ రహానేలపై వేటు వేయడానికి కోహ్లి వెనుకాడలేదు.
ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో కూడా తొలి రెండు టెస్టుల్లో రోహిత్‌కే అవకాశం కల్పించాడు. సొంతగడ్డపై, శ్రీలంకపై ప్రదర్శనను చూపించి ‘తాజా ఫామ్’ వల్ల ఎంపిక చేశామని సమర్థించుకున్నాడు. 4 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 78 పరుగులు మాత్రమే చేయగా... మూడో టెస్టులో రహానే కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గెలుపు బాట వేశాడు. అఫ్గానిస్తాన్‌తో టెస్టుకే పక్కన పెట్టినా, ఆ మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో రోహిత్ వేటుపై పెద్దగా చర్చ జరగలేదు. కానీ బంతి సుడులు తిరిగే ఇంగ్లండ్ స్వింగ్ పరిస్థితుల్లో అతని ఆట పనికిరాదని మాత్రం ఖాయమైపోయింది. సెలక్టర్లు కూడా ‘తెల్ల బంతి’ ఫామ్ మాయలో పడకుండా సంయమనం పాటించారు. గత నెలలో అఫ్గాన్‌తో టెస్టులో చోటు కోల్పోయిన తర్వాత ‘నా కెరీర్ ఇప్పటికే సగం ముగిసింది. మిగిలిన సమయంలో నేను ఎంపిక అవుతానా, కాదా అని ఆందోళన చెందుతూ కూర్చోలేను. ఇప్పుడు ఆ దశ దాటిపోయాను. నేను చేయగలిగిందే ఇప్పుడు చేస్తాను’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించడం అతని టెస్టు భవిష్యత్తు గురించి చెప్పేసింది.
తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచినా... రంజీ ట్రోఫీ ఫైనల్లో సచిన్ తర్వాత రెండు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందినా బలహీనమైన బ్యాటింగ్ టెక్నిక్ కారణంగా రోహిత్ టెస్టు కెరీర్ ఎప్పుడూ సాఫీగా సాగలేదు. వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆరేళ్లకు తొలి టెస్టు ఆడిన రోహిత్, 22వ టెస్టులో గానీ మూడో సెంచరీ చేయలేకపోయాడు. కెరీర్‌లో 9 హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. టెస్టుల్లో గుర్తుంచుకునే, విలువైన ఇన్నింగ్స్ ఏదీ అతను ఆడలేదు. 25 టెస్టుల్లో 39.97 సగటుతో 1479 పరుగులు మెరుగ్గానే కనిపిస్తున్నా... 16 విదేశీ టెస్టుల్లో 25.35 సగటుతో 710 పరుగులు మాత్రమే చేయగలగడం అతని వైఫల్యానికి సూచిక. ఇదే ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు జట్టులో స్థానం చేజార్చింది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యద్భుత బ్యాటింగ్ ప్రదర్శనలు, టీమిండియా చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించినా... టెస్టులకు వచ్చేసరికి సాధారణ ఆటగాడిగానే పరిమితం కావడంలో మరో స్టార్ యువరాజ్ సింగ్‌తో రోహిత్‌ను పోల్చవచ్చు. యాదృచ్ఛికమే అయినా వీరిద్దరి టెస్టు రికార్డు చాలా వరకు ఒకే తరహాలో ఉంది. ‘టెస్టుల్లో స్థానం కోసం నేను చేయగలిగినదంతా చేశాను’ అంటూ ఒకనాడు రోహిత్‌లాగే వ్యాఖ్యానించిన యువీ 40 టెస్టుల్లో 33.92 సగటుతో 3 సెంచరీలు, 11 అర్ధసెంచరీలతో 1900 పరుగులు చేశాడు.
‘రేపు మళ్లీ సూర్యోదయం అవుతుంది’ – టెస్టు జట్టును ప్రకటించాక రోహిత్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment