
కాబుల్‌లో సన్‌రైజర్స్‌కు వెర్రెత్తే క్రేజ్
సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లంటే ఆప్ఘనిస్తాన్ వాసుల్లో పిచ్చి క్రేజ్ ఏర్పడింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లంటే ఆప్ఘనిస్తాన్ వాసుల్లో పిచ్చి క్రేజ్ ఏర్పడింది. ఎంతలా అంటే సొంత పనులన్నింటిని పక్కన బెట్టేసి మ్యాచ్ సమయానికి టీవీలకు అతుక్కుపోతున్నారు. ఓ వైపు ఉగ్రవాద దాడులు, అమెరికా దళాల ప్రతిదాడులతో తమ ప్రాంతాలు దద్దరిల్లుతున్నా అదరక బెదరక సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల కోసం వేచి చూస్తున్నారు. ఇందుకు కారణం ఆ దేశ క్రికెటర్ రషీద్ ఖాన్. రషీద్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నాడు.
ఐపీఎల్‌లో ఆడుతున్న తొలి ఆప్ఘాన్ క్రికెటర్ రషీదే. ఆఫ్ఘాన్‌కే చెందిన మహ్మద్ నబీని కూడా హైదరాబాద్ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకూ నబీని బరిలోకి దించలేదు. రషీద్ గురించి ఢిల్లీలో ఉంటున్న ఓ ఆప్ఘానీని ప్రశ్నించగా.. ఆప్ఘనిస్తాన్ మొత్తం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ప్రేమిస్తోందని చెప్పారు. అందుకు కారణం ఆ జట్టు రషీద్‌ను వేలంలో తీసుకోవడమేనని తెలిపారు. తన కుటుంబీకులకు ఫోన్ చేస్తే సన్‌రైజర్స్ మ్యాచ్ చూస్తున్నామని తర్వాత మాట్లాడతామని పెట్టేశారని చెప్పారు.
తన కుటుంబంలో అసలు ఎవరూ క్రికెట్ చూడరని.. అయితే, రషీద్‌ఖాన్‌ను హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన తర్వాత క్రికెట్ చూస్తున్నామని వాళ్లందరూ చెప్పడం ఆనందం కలిగించిందని తెలిపారు. రషీద్ జన్మస్ధలమైన నాన్‌గర్‌హర్ ప్రావిన్సులోనే గురువారం అమెరికా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్‌ను ఉపయోగించి ఉగ్రవాదులపై దాడి చేసింది.