వింబుల్డన్‌కు వేళాయె...  | Wimbledon Grand Slam Tourney Starts Today | Sakshi
Sakshi News home page

వింబుల్డన్‌కు వేళాయె... 

Published Mon, Jul 1 2019 9:36 AM | Last Updated on Mon, Jul 1 2019 9:36 AM

Wimbledon Grand Slam Tourney Starts Today - Sakshi

నొవాక్‌ జొకోవిచ్‌

లండన్‌ : ఇప్పటికే క్రికెట్‌ ప్రపంచకప్‌ కిక్‌లో ఉన్న క్రీడాభిమానులకు నేటి నుంచి మొదలయ్యే ప్రతిష్టాత్మక గ్రాస్‌ కోర్టు సమరం వింబుల్డన్‌ టోర్నమెంట్‌ మరింత వినోదాన్ని పంచనుంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్, టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)తోపాటు మాజీ చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నారు. ఇటీవల జరిగిన హాలె ఓపెన్‌ను రికార్డుస్థాయిలో పదోసారి గెలిచిన రోజర్‌ ఫెడరర్‌ తన కెరీర్‌లో తొమ్మిదో వింబుల్డన్‌ టైటిల్‌పై కన్నేశాడు. ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన నాదల్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురవ్వడంతో అతను రెండో రౌండ్‌ నుంచే బలమైన ప్రత్యర్థులతో పోటీ పడాల్సి ఉంది. సోమవారం జరిగే తొలి రౌండ్‌లో ఫిలిప్‌ కోల్‌ష్రైబర్‌ (జర్మనీ)తో జొకోవిచ్‌ తలపడతాడు. తనస్థాయికి తగ్గట్టు ఆడితే జొకోవిచ్‌ ఫైనల్‌ చేరుకునే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి ఫెడరర్, నాదల్‌లలో ఒకరు ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోవచ్చు. మంగళవారం జరిగే తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో క్వాలిఫయర్‌ యుచి సుగిటా (జపాన్‌)తో నాదల్‌... లాయిడ్‌ హారిస్‌ (దక్షిణాఫ్రికా)తో ఫెడరర్‌ పోటీపడతారు. జొకోవిచ్, ఫెడరర్, నాదల్‌లతో పాటు అండర్సన్‌ (దక్షిణాఫ్రికా), అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), వావ్రింకా (స్విట్జర్లాండ్‌), సిట్సిపాస్‌ (గ్రీస్‌), సిలిచ్‌ (క్రొయేషియా) కూడా సంచలన ఫలితాలు సాధించే సత్తా ఉన్నవారే. మహిళల సింగిల్స్‌ విభాగంలో కచ్చితమైన ఫేవరెట్స్‌ కనిపించడం లేదు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్, కొత్త ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తోపాటు మాజీ చాంపియన్స్‌ సెరెనా, వీనస్‌ (అమెరికా), కెర్బర్‌ (జర్మనీ), క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), మాజీ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా (జపాన్‌), సిమోనా హలెప్‌ (రొమేనియా) టైటిల్‌ రేసులో ఉన్నారు.   

ప్రజ్నేశ్‌కు క్లిష్టం 
భారత్‌ తరఫున పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ ఒక్కడే ఉన్నాడు. సోమ వారం జరిగే తొలి రౌండ్‌లో అతను 2016 రన్నరప్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా)తో ఆడతాడు.   

విజేతకు రూ. 20 కోట్లు 
ఈ ఏడాది పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు 23 లక్షల 50 వేల పౌండ్ల (రూ. 20 కోట్ల 57 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తాయి. రన్నరప్‌గా నిలిచిన వారు 11 లక్షల 75 వేల పౌండ్ల చొప్పున (రూ. 10 కోట్ల 28 లక్షలు) అందుకుంటారు. తొలి రౌండ్‌లో ఓడిన వారికి 45 వేల పౌండ్ల (రూ. 39 లక్షల 40 వేలు) చొప్పున లభిస్తాయి.  

12–12 వద్ద టైబ్రేక్‌... 
సింగిల్స్‌లో చివరి సెట్‌లో టైబ్రేక్‌ లేనికారణం గా గతంలో వింబుల్డన్‌లో ఎన్నో సుదీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. ఈ ఏడాది నుంచి సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో చివరి సెట్‌లో తొలిసారి టైబ్రేక్‌ను ్రçపవేశపెట్టారు. స్కోరు 12–12 వద్ద రాగానే టై బ్రేక్‌ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ఈసారి కొత్తగా నంబర్‌వన్‌ కోర్టుకు కూడా పైకప్పును ఏర్పాటు చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement