ప్రమాదంలో రస్సెల్ కెరీర్?
సెయింట్ కిట్స్: వెస్టిండీస్ స్టార్ ఆటగాడు, ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ కెరీర్ ప్రమాదంలో పడింది. డోపింగ్ టెస్టులకు ఆండ్రీ రస్సెల్ పలుమార్లు గైర్హాజరీ కావడంతో అతనిపై రెండేళ్ల పాటు నిషేధం పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఏడాదిలో మూడుసార్లు స్థానిక డోపింగ్ పరీక్షలకు హాజరు కావాల్సిన ఉన్నా రస్సెల్ మాత్రం ఆ నిబంధనల్ని ఉల్లఘించాడు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(డబ్యూఏడీఏ) నియామవళి ప్రకారం ప్రతీ అథ్లెట్ ఏడాదిలో మూడు సార్లు స్థానిక యాంటీ డోపింగ్ కమిషన్ ముందు హాజరు కాకుండా ఉంటే అతను డోపింగ్ కు పాల్పడినట్లు నిర్ధారిస్తారు.
దీనిలో భాగంగా జమైకా యాంటీ డోపింగ్ కమిషన్(జడ్కో) నిర్వహించే పరీక్షలకు రస్సెల్ హాజరుకాలేదు. ఈ విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ దృష్టికి తీసుకువెళ్లడంతో అతనిపై విచారణకు రంగం సిద్ధం చేసింది. ఈ విచారణలో రస్సెల్ ఉద్దేశ పూర్వకంగానే డోపింగ్ పరీక్షలకు హాజరు కాలేదని తేలితే అతనిపై సుమారు రెండేళ్ల పాటు అంతర్జాతీయ నిషేధం అమలయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు పలు దేశాల్లో జరిగే లీగ్ లకు కూడా రస్సెల్ దూరం కాక తప్పదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు రస్సెల్ ప్రాతినిథ్యం వహిస్తుండగా, బిగ్ బాష్ లీగ్లో సిడ్నీ థండర్ కు, పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు రస్సెల్ ఆడుతున్నాడు.