ప్రావిడెన్స్ (గయానా): మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ మూడు పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. ఇరు జట్ల మధ్య చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో విండీస్ పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, బంగ్లాదేశ్ 268 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. బంగ్లా ఆటగాళ్లలో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(54), షకిబుల్ హసన్(56), ముష్పికర్ రహీమ్(68)లు హాఫ్ సెంచరీలు సాధించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.
లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో విండీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి గెలుపును అందుకుంది. చివరి ఓవర్‌లో బంగ్లాదేశ్ విజయానికి 8 పరుగులు అవసరమైన తరుణంలో హోల్డర్ ఆకట్టుకున్నాడు. ఒక వికెట్ తీయడంతో పాటు నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి విండీస్‌ను గెలిపించాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ 49.3 ఓవర్లలో 271 పరుగులు చేసింది. క్రిస్ గేల్(29), సాయ్ హోప్(25) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, షిమ్రోన్ హెట్‌మయర్(125; 93 బంతుల్లో 3ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో మెరిశాడు. అతనికి సాయంగా రోవ్‌మాన్ పావెల్(44) సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో విండీస్ గౌరవప‍్రదమైన స్కోరు చేసింది. ఆపై లక్ష్య ఛేదనలో బంగ్లా పోరాడినా పరాజయం తప్పలేదు. దాంతో సిరీస్ 1-1తో సమం అయ్యింది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment