ఆసీస్‌ ప్రతీకారం | Womens World T20: Australia beat West Indies to reach final | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ ప్రతీకారం

Published Sat, Nov 24 2018 1:04 AM | Last Updated on Sat, Nov 24 2018 1:04 AM

Womens World T20: Australia beat West Indies to reach final - Sakshi

నార్త్‌సౌండ్‌: అదరగొట్టే ఆటతో ఆస్ట్రేలియా మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరింది. గురువారం రాత్రి ఇక్కడ జరిగిన తొలి సెమీ ఫైనల్లో... డిఫెండింగ్‌ చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్‌ను ఆ జట్టు 71 పరుగుల తేడాతో సునాయాసంగా ఓడించింది. తద్వారా రెండేళ్ల క్రితం ప్రపంచ కప్‌ ఫైనల్లో కరీబియన్ల చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. లీగ్‌ దశను అజేయంగా ముగించి, సొంతగడ్డపై టైటిల్‌ ఫేవరెట్‌గా అంచనాలున్న విండీస్‌... కీలక సమయంలో చేతులెత్తేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్‌ అలీసా హీలీ (38 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి చెలరేగగా, కెప్టెన్‌ మెగాన్‌ లానింగ్‌ (39 బంతుల్లో 31; 2 ఫోర్లు) అండగా నిలిచింది. చివర్లో రాచెల్‌ హేన్స్‌ (15 బంతుల్లో 25 నాటౌట్‌; 4 ఫోర్లు) విలువైన పరుగులు చేసింది. ఛేదనలో ఎలైస్‌ పెర్రీ (2/2),  కిమ్మిన్స్‌ (2/17), గార్డ్‌నర్‌ (2/15) ధాటికి వెస్టిండీస్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ (28 బంతుల్లో 16; 1 ఫోర్‌) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడంతో 17.3 ఓవర్లలో 71 పరుగులకే ఆలౌటైంది. 

►ఆస్ట్రేలియా మహిళలు వరుసగా ఐదోసారి టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరారు. 2010, 2012, 2014లలో విజేతలుగా నిలిచిన ఆ జట్టు 2016 ఫైనల్లో విండీస్‌ చేతిలో ఓడింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement