ఆటకంటే మాటకే విలువ ఎక్కువ!
ముంబై: అద్భుతమైన షాట్లు, బౌండరీలతో క్రికెట్ మజాను అందించేది వారు... ఆట విలువ పెరగాలన్నా, అభిమానులకు చేరువై బోర్డుకు అంతులేని ఆదాయం రావాలన్నా అది క్రికెటర్లతోనే. ప్రేక్షకులు క్రికెట్‌ను ఈ స్థాయిలో ఆదరించేది ఆటగాళ్లను చూసే కానీ వ్యాఖ్యాతలు చెప్పే వ్యాఖ్యానాలు విని కాదు! కానీ బీసీసీఐ మాత్రం అలా భావిస్తున్నట్లు లేదు. ప్రతీ ఏటా ఆటగాళ్లతో ఇచ్చే మొత్తంకంటే అధికారిక కామెంటేటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిలకు బోర్డు చాలా ఎక్కువ చెల్లిస్తోండటం విశేషం. భారత జట్టుకు తిరుగులేని నాయకుడిగా గుర్తింపు ఉన్న ధోని, స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లిలకు ఇచ్చేదానికంటే కూడా ఇది అధికంగా ఉంది.
బీసీసీఐ కామెంటేటర్లుగా భారత్ ఆడే ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌కు వ్యాఖ్యానం అందిస్తున్నందుకు సన్నీ, శాస్త్రిలకు బోర్డు ఏటా రూ. 4 కోట్లు చెల్లిస్తోంది. దీనికి అదనంగా ఈ సీజన్‌లో ఐపీఎల్ వ్యవహారాలు నిర్వహించినందుకు గవాస్కర్‌కు మరో 2.37 కోట్లు... టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రికి కూడా దాదాపు ఇదే మొత్తం ఇస్తున్నట్లు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. అంటే వీరిద్దరికి ఏడాదికి చెరో రూ. 6.37 కోట్లు దక్కుతోంది.
అదే భారత జట్టు తరఫున గత ఏడాది కాలంలో 35 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ధోని బీసీసీఐ నుంచి రూ. 2.59 కోట్లు అందుకోగా, 39 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి రూ. 2.75 కోట్లు తీసుకున్నాడు. ఇందులో మ్యాచ్ ఫీజుతో పాటు ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్‌లో కొనసాగిస్తున్నందుకు ఇస్తున్న రూ. కోటి కూడా ఉన్నాయి. క్రికెటర్లు ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీ మొత్తం సంపాదిస్తుండవచ్చు గాక... కానీ తమ ఆటగాళ్లకంటే కామెంటేటర్లకే బోర్డు ఎక్కువ విలువ కట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే.