హైదరాబాద్: దాదాపు 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వదేశంలో 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ను టీమిండియా రెండోసారి ముద్దాడింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అపూర్వ విజయం సాధించి భారత్ జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు సంబంధించి ఆనాటి లంక సారథి కుమార సంగక్కర పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో సంగక్కర పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ వేసిన విషయాన్ని తెలుపుతూ, దానికి గల కారణాలు వెల్లడించాడు. (ధోనికి ఆ హక్కు ఉంది )
‘నేనెప్పుడు శ్రీలంకలో అంతమంది ప్రేక్షకులను మైదానంలో చూడలేదు. ఆ స్థాయిలో అభిమానులు మైదానానికి రావాలన్నా, ఆటగాళ్లను ఉత్సాహపరచాలన్నా అది భారత్‌లోనే సాధ్యం అవుతుందనుకుంటా!. కిక్కిరిసిన ప్రేక్షకులు, భారీ శబ్దాలు, ఫైనల్ టెన్షన్‌తో టాస్‌కు వెళ్లాం. ధోని టాస్ వేశాడు. నేను టెయిల్స్ అన్నాను. భారీ శబ్దాల కారణంగా నేను చెప్పింది ధోనికి వినపడలేదు. అతడు నన్ను అడిగాడు..నువ్వు టెయిల్స్ అన్నావా? అని, కాదు నేను టెయిల్స్ అని అన్నాను. దీనిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్‌లో సౌండ్స్ ఉన్నాయో. ఇక మ్యాచ్ రిఫరీ వచ్చి శ్రీలంక టాస్ గెలిచిందని చెప్పగా ధోని గందరగోళంగా ఉందని మరోసారి టాస్ వేయాలని రిఫరీని, నన్ను కోరాడు. దీంతో మరోసారి టాస్‌కు వెళ్లాం. (నన్ను అవమానించారు.. లేదు మనోజ్!)
మరోసారి టాస్ వేయగా మళ్లీ మేమే గెలిచాం బ్యాటింగ్ తీసుకున్నాం. బహుశా రెండో సారి మేము టాస్ ఓడిపోయి ఉంటే టీమిండియా తొలుత బ్యాటింగ్ తీసుకునేది కావచ్చు. మేము లక్ష్యాన్ని ఛేదించేవాళ్లం కావచ్చు. ఎందుకంటే ఐదు, ఆరు స్థానాల వరకు మా బ్యాటింగ్ దుర్బేద్యంగా ఉంది. అప్పటికీ మేము బ్యాటింగ్‌లో పలు ప్రయోగాలు చేసి విజయవంతమయ్యాం. ఇక మాథ్యూస్ గాయం కూడా మా ఓటమికి కారణమైంది. అతడు ఆరోజు మ్యాచ్‌లో ఉండి ఉంటే మేము ఛేజింగ్ వైపు మొగ్గు చూపేవాళ్లం. ఎందుకంటే అవసరమైన సమయంలో టెయిలెండర్ల సహాయంతో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను గట్టెక్కించేవాడు. జరిగిందేదో జరిగిపోంది. టీమిండియా అద్భుతంగా ఆడింది. ధోని తన స్టైల్లో సిక్సర్ కొట్టి టీమిండియాకు ప్రపంచకప్‌ను అందించాడు’అని పేర్కొంటూ ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు సంగక్కర.
ప్రపంచకప్-2011: సంగక్కర ఆసక్తికర ముచ్చట్లు
Published Fri, May 29 2020 9:08 AM | Last Updated on Fri, May 29 2020 9:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment