ధోనిని మైమరిపించాడు..
విశాఖ:టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా మన్ననలు అందుకుంటున్న మరో వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా..ధోని శైలిని బాగానే వంట బట్టించుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ధోని బంతిని పూర్తి అందుకోకుండానే వికెట్లపైకి విసరడం ఆ క్రమంలోనే ప్రత్యర్థి ఆటగాళ్లను అవుట్ చేయడం చూస్తునే ఉన్నాం. ఇటీవల రాంచీలో న్యూజిలాండ్ తో జరిగిన నాల్గో వన్డేలో రాస్ టేలర్ ను ఇదే తరహాలో అవుట్ చేశాడు. ధావల్ కులకర్ణి విసిరిన త్రో కోసం ధోని ముందుకు కొచ్చి.. బౌన్స్ అయి వచ్చిన బంతిని అందుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండానే అదే వేగంతో రెప్పపాటులో వికెట్లపైకి విసిరేశాడు ధోనీ.
తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో సాహా ఇదే శైలిని అవలంభించాడు. శుక్రవారం రెండో రోజు ఆటలో హషీబ్ హమీద్ ను సాహా ఇలా రనౌట్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. భారత బౌలర్ రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 21.0ఓవర్ లో ఒక బంతిని రూట్ లెగ్ సైడ్ కు నెట్టి సింగిల్ పూర్తి చేశాడు. అయితే రెండో పరుగు కోసం రూట్ తొలుత సిగ్నల్ ఇవ్వడంతో హమీద్ పరుగు కోసం యత్నించాడు. అయితే ఆ పరుగు వద్దంటూ రూట్ అవతలి ఎండ్ నుంచి చెప్పినా, హమిద్ ముందుకు వచ్చేశాడు. ఈ క్రమంలోనే హమిద్ క్రీజ్ లోకి వెనుక్కు వెళ్లే యత్నం చేశాడు. కాగా, జయంత్ యాదవ్ విసిరిన అద్భుతమైన త్రోను వికెట్లకు దూరంగా అందుకున్న సాహా.. ఆ బంతిని పూర్తి అందుకోకుండానే వికెట్లపైకి విసిరేశాడు. దాంతో ఆ బంతి బెయిల్స్ ను లేపడం, హమిద్ అవుట్ కావడం జరిగిపోయాయి. దాంతో ధోనిని మైమరిపించిన సాహాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.