
'రాత్రికి రాత్రే 400 కోట్లు ఎలా బదిలీ చేస్తారు'
న్యూఢిల్లీ: లోధా ప్యానెల్ ప్రతిపాదనల అమలు విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నిర్లక్ష్య ధోరణి మరోసారి సుప్రీంకోర్టుకు ఆగ్రహాన్ని తెప్పించింది. బీసీసీఐలో ప్రక్షాళన తీసుకొచ్చేందుకు లోధా ప్యానెల్ ప్రతిపాదనలు సూచిస్తే వాటిని అమలు చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని సుప్రీం మండిపడింది. దీనిలో భాగంగా బీసీసీఐ అనుబంధ రాష్ట్ర అసోసియేషన్లకు రూ.400 కోట్ల రూపాయల్ని బదిలీ చేయడాన్ని సుప్రీం తప్పుబట్టింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో పారదర్శకత విధానం ఉన్నట్లయితే రాత్రికి రాత్రి ఆ నిధులను ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. అసలు బీసీసీఐలో ఉన్న వారి అర్హత ఏమిటో చెప్పాలంటూ జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు.
జస్టిస్ ఆర్‌ఎం లోధా దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం సుప్రీంకోర్టు విచారిస్తుంది. దీనిలో భాగంగా ఇరు పక్షాల వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. ఒకవైపు తమ ప్రతిపాదనల్ని అమలు చేయడంలో లెక్కలేనితనం ప్రదర్శిస్తున్న బీసీసీఐలో అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని తొలగించాలంటూ లోధా సుప్రీంను కోరింది. మరోవైపు తాము లోధా కమిటీ మెయిల్స్ కు స్పందించలేదంటూ చెప్పడం సరికాదని బీసీసీఐ పేర్కొంది. కోర్టుకు సమర్పించాల్సిన 40 మెయిల్స్ ను లోధా ప్యానెల్ కు పంపినట్లు బీసీసీఐ తెలిపింది.