జహీర్ కు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ కు సంబంధించి ఢిల్లీ డేర్ డేవిల్స్ కెప్టెన్గా భారత మాజీ పేసర్ జహీర్ఖాన్ నియమించబడ్డాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున వరుసగా రెండో సంవత్సరం ఆడుతున్న జహీర్ కు సారథిగా కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఆ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్.. రాబోవు ఐపీఎల్ సీజన్ లో జహీర్ ను కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది.. దీనిపై ఆ జట్టు సలహాదారు రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ఆటలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాక్ లో నాయకత్వ లక్షణాలకు కొదవలేదని పేర్కొన్నాడు.
ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్న జహీర్ నియామకం పట్ల యాజమాన్యం సంతృప్తిగా ఉందన్నాడు. ఈ సందర్భంగా జహీర్ కు ముందుగా ద్రవిడ్ అభినందనలు తెలియజేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన జహీర్.. 200 వన్డేల్లో 281 వికెట్లు తీయగా, 92 టెస్టుల్లో 311 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున 17 ట్వంటీల్లో 17 వికెట్లు తీశాడు.