చిక్కులు.. సందేహాలు | doughts on dsc notification and tet Management | Sakshi
Sakshi News home page

చిక్కులు.. సందేహాలు

Published Tue, Feb 6 2018 12:45 PM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

doughts on dsc notification and tet Management

శ్రీకాకుళం: ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పూర్తిచేస్తుందా? లేక ప్రకటనలతో సరిపుచ్చుతుందా? అని బీఎడ్‌ అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరులోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ అని ప్రకటించినా ఇప్పటివరకు దానికి సంబంధించి కార్యాచరణ మాత్రం ఖరారు కాలేదు. డీఎస్సీకి అర్హత పరీక్షగా భావించే టెట్‌ విషయంలో రోజుకో సవరణ జీఓ విడుదల చేస్తూ ప్రభుత్వం అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టేస్తోంది. జనవరి 12న విడుదల చేసిన జీవోతో బీఎడ్‌ అభ్యర్థులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.

గతంలో ఇలా
గతంలో టెట్‌ పరీక్షలకు సంబంధించి తెలుగు పండిట్, హిందీ పండిట్‌ అభ్యర్థులకు టెట్‌ పేపరు–2 నిర్వహించేవారు.  టీపీటీ, హెచ్‌పీటీ అభ్యర్థులు సాంఘికశాస్త్రం, గణితం సబ్జెక్టును ఎంచుకుని పరీక్ష రాసేవారు ఏదో ఒకటి ఎంచుకుని 60 మార్కులకు ఆయా సబ్జెక్టుల్లో సన్నద్ధమయ్యేవారు. గత ఏడాది జనవరిలో హిందీ భాష పండితులు.. టెట్‌ పరీక్ష పేపరు–2లో హిందీకి సంబంధించిన కంటెంట్‌ను 60 మార్కులకు పెట్టాలని డిమాండ్‌ చేశారు. అప్పటి నుంచి ఏడాదిగా పట్టించుకోని ప్రభుత్వం.. టెట్‌ ప్రకటన విడుదల చేసిన నెల రోజుల తర్వాత కొత్త జీవో విడుదల చేసింది. దీంతో కొత్త తల నొప్పులు మొదలయ్యాయి. సాధారణంగా బీఎడ్‌ అభ్యర్థులు మెథడాలజీలో మొదటి సబ్జెక్టుగా సైన్సు, సోషల్, గణితాన్ని ఎన్నుకుని రెండో మెథడాలజీగా తెలుగు గానీ ఇంగ్లిషునుగానీ ఎంచుకుంటారు.

ఇలా ఎంచుకుని బీఎడ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఎంఏ తెలుగు లేదా ఇంగ్లిషు చేస్తే వారు డీఎస్సీలో తమ సబ్జెక్టుతోపాటు భాష పండిత పరీక్ష రాసుకునేందుకు అర్హులవుతారు. గతంలో టెట్‌ పేపరు–2కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డీఎస్సీలో పండిట్స్‌ పరీక్ష కూడా రాసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.కానీ ప్రస్తుతం అలా పండిట్‌ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు పేపరు–2 నుంచి పేపరు–3కి మారాలని సూచించింది. తెలుగు పండిట్స్‌కు దరఖాస్తు చేసుకున్న పీజీ అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌ వారి మెథడాలజీని బట్టి సాంఘిక, బయాలజీ, ఫిజికల్‌ సైన్సు, గణితం పరీక్షలకు అర్హులవుతారు.

రెండింటినీ రాయాలంటే..
సాధారణంగా చాలా మంది అభ్యర్థులు తమ మెథడాలజీ ప్రకారమే టెట్‌కు సన్నద్ధం అవుతారు. వీరికి అర్హత ఉంటే పండిత పరీక్ష కూడా రాసుకునేందుకు టెట్‌ మార్కులనే పరిగణనలోకి తీసుకునేవారు. ప్రస్తుతం భాష పండిత పరీక్ష రాయాలంటే పేపరు–3 రాయాలని జీఓ విడుదల చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వం పేపరు–2 నుంచి పేపరు–3కి మారేందుకు అవకాశం కల్పించింది. తిరిగి పేపరు–2 రాయాలంటే మరోమారు దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు ఉందా లేక కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతోపాటు ఆయా పరీక్షలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాల్సిందే. ఒకవేళ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నా ఇప్పటికే గడువు ముగిసింది. ప్రభుత్వం ఒకే ఫీజుతో స్కూల్‌ అసిస్టెంట్, భాష పండిత పరీక్ష రాసుకునేలా అవకాశం కల్పించాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం పేపరు–3కి ఎటువంటి సిలబస్‌ ఉంటుందో అనే విషయాన్ని పేర్కొనలేదు. ఒకవేళ సిలబస్‌ పెంచితే ఎలా సన్నద్ధమవ్వాలనే వారికి ప్రశ్నార్థకంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement