సాక్షి, బెంగళూరు : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. పార్టీ మైనారిటీ విభాగం బెంగళూరులో ఆదివారం ఏర్పాటు చేసిన ‘ముస్లిం మేధావుల సమావేశం’లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్‌తోపాటు బీజేపీతో చేరి జేడీఎస్ కొన్ని ఎన్నికలు ఎదుర్కొవాల్సి వ చ్చిందన్నారు. అయితే దీని వల్ల జేడీస్ పార్టీ కొంత నష్టపోయిన మాట వాస్తవమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు సమదూరంలో ఉండాలని నిర్ణయించామని దేవెగౌడ తెలిపారు.
ఆ రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముస్లిం వర్గీయులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాల సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. కేంద్రంలో లౌకిక పార్టీ అధికారంలోకి రావాలనేది తన అభిమతమని దేవెగౌడ పేర్కొన్నారు. అంతకు ముందు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... తమ ప్రభుత్వ హయాంలో ముస్లింల సంక్షేమ పథకాల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టామన్నారు. తాను కాని తమ పార్టీ కాని జాతి పేరుతో రాజకీయాలు నడపలేదన్నారు. కార్యక్రమంలో శాసనసభ ప్రతిపక్షనాయకుడు కుమారస్వామి, జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు ఏ.కృష్ణప్ప, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీం, పార్టీ నాయకులైన జఫరుల్లా, సయ్యద్ వ ూహిద్ ఆల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఆ రెండు పార్టీలతో పొత్తు ఉండదు
Published Mon, Dec 23 2013 1:33 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement