రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం
కేంద్ర మంత్రి డి.వి.సదానంద గౌడ
నగరంలో బీజేపీ బృహత్ చైతన్య ర్యాలీ
బెంగళూరు: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని కేంద్ర మంత్రి డి.వి.సదానంద గౌడ విమర్శించారు. ఆదివారమిక్కడి బ్యాటరాయణపుర ప్రాంతంలో నిర్వహించిన క్షేత్రస్థాయి కార్యకర్తల సమావేశం, బృహత్ చైతన్య ర్యాలీని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్పతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. సదానంద గౌడ మాట్లాడుతూ....‘ప్రధాని నరేంద్రమోదీ నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. 3-4నెలలకోసారి జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి కేంద్రంతో మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. అయితే ఈ సమావేశాలకు సీఎం సిద్ధరామయ్య హాజరు కావడమే లేదు. ఏదో ఒక సాకు చెప్పి ఈ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. దీన్నేనా అభివృద్ధి మంత్రం అంటారు. బహుశా రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు అధికారుల ఆత్మహత్యలపై ప్రధాని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే సమావేశానికి గైర్హాజరయ్యారేమో!’ అని కేంద్ర మంత్రి సదానందగౌడ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తైదని, అయినా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
బి.ఎస్.యడ్యూరప్ప మాట్లాడుతూ....కాంగ్రెస్ ప్రభుత్వ అరచకాలతో ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోందని మండిపడ్డారు. సిద్ధరామయ్య మంత్రి వర్గ సహచరులు రూ.11లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఈకేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలను గెలిచే దిశగా కార్యాచరణ ప్రణాళికలను రచిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కార్యకర్తలు యడ్యూరప్పను వెండి కిరీటంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆర్.అశోక్, ఎస్.ఆర్.విశ్వనాథ్, మునిరాజు తదితరులు పాల్గొన్నారు.