చెన్నై, సాక్షి ప్రతినిధి : వేధింపులకు గురిచేస్తున్న శ్రీలంక మత్స్యకారులపై తమిళ జాలర్లు దెబ్బకు దెబ్బ తీశారు. తమ సరిహద్దుల్లోకి వచ్చారంటూ 12 మంది శ్రీలంక జాలర్లను పట్టుకుని పుళల్ జైల్లోకి నెట్టారు. శ్రీలంక పరిధిలోని కచ్చదీవుల్లోకి తమిళనాడు మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారంటూ ఇరువర్గాల మధ్య తరచూ గొడవలు సాగుతూనే ఉన్నా యి. శ్రీలంక, తమిళనాడు మధ్య కొరకరాని కొయ్యగా ఈ సమస్య మారిపోయింది. కచ్చదీవులపై శ్రీలంక హక్కులను భారత్ పునఃపరిశీలించి, తిరిగి స్వాధీనం చేసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జయలలిత గతంలో అనేక సార్లు ప్రధానికి లేఖ రాశారు.
కచ్చదీవులు భారత్‌వేనంటూ తమిళ అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీంతో మరింత ఒత్తిడికి గురైన శ్రీలంక రెచ్చిపోయింది. తమిళ మత్స్యకారులపై దాడులను తీవ్రతరం చేసింది. దొరికినవారిని దొరికినట్లుగా తమ జైళ్లలోకి నెట్టడం ప్రారంభించింది. మత్స్యకారుల మరపడవలను స్వాధీనం చేసుకోవడం పెరిగిపోయింది. గతనెల 27న రామేశ్వరం నుంచి చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక మళ్లీ చెరపట్టింది. శ్రీలంక కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది. సరిగ్గా రెండోరోజుకే అంటే గత నెల 29న మరో 16 మందిని శ్రీలంక దళాలు అరెస్ట్ చేశాయి. ఇలా ప్రస్తుతం శ్రీలంక చెరలో ఉన్న 20 మంది జాలర్లను, 75 మరపడవలను విడిపించేందుకు శ్రీలంకతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ నెల 1 వ తేదీన ప్రధాని నరేంద్రమోడీకి ఉత్తరం రాశారు.
పట్టుబడిన 12 మంది
కన్యాకుమారి సముద్రతీరంలో చేపలవేట సాగిస్తున్న 12 మంది శ్రీలంక జాలర్లను తమిళ జాలర్లు శనివారం పట్టుకున్నారు. శ్రీలంక సముద్రతీర హద్దులను దాటి భారత్‌లోకి ప్రవేశించారు. వారిని రామనాథపురం రెండో అదనపు మేజిస్ట్రేటు క్రిమినల్ కోర్టులో ప్రవేశపెట్టారు. శ్రీలంక జాలర్లకు 16వ తేదీ వరకు రిమాండ్ విధించిన కోర్టు చెన్నైలోని పుళల్‌జైలుకు వారిని తరలించాలని ఆదేశించింది. నిందితులంతా శ్రీలంక పుత్త్తాళం ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు.
దెబ్బకు దెబ్బ
Published Sun, Oct 5 2014 1:28 AM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM
Advertisement
Advertisement