కేకే.నగర్: చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా రెండున్నర కిలోల బంగారం తీసుకొస్తున్న ఆంధ్రా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి కువైట్ నుంచి కువైట్ ఎయిర్‌లైన్స్ విమానం చేరుకుంది. అందులో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా, ఒక మహిళపై అధికారులకు అనుమానం రావడంతో ఆమె హ్యాండ్‌బాగ్‌ని పరిశీలించగా నలుపు పాలథిన్ కవరులో 100 గ్రాముల బరువు గల ఐదు బంగారు బిస్కెట్లు కనిపించాయి.
దీంతో ఆమెను ప్రత్యేక గదికి తీసుకెళ్లి సోదా చేయగా లోదుస్తుల్లో రెండు కిలోల బరువు గల ఇరవై బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. ఆంధ్రా రాజంపేటకు చెందిన లక్ష్మీదేవి (38). రెండేళ్ల క్రితం ఇంటి పనులు చేయడానికి కువైట్ వెళ్లిందని, తిరిగి సొంతూరుకు వస్తున్న విషయం తెలిసి అంతర్జాతీయ బంగారం అక్రమ స్మగ్లర్లు ఆమెకు రూ.20వేలు ఇస్తామని చెప్పి బంగారు బిస్కెట్లు ఇచ్చి పంపినట్లు తెలిసింది.
బ్యాగులో ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకుంటే వాటికి తగిన మూల్యం చెల్లిస్తామని, లోదుస్తుల్లో ఉన్న బంగారాన్ని మాత్రం వారు చెప్పిన హోటల్‌కు తీసుకువస్తే అక్కడ ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పినట్లు లక్ష్మీదేవి తెలిపింది. అధికారులు ఆమెను విచారణ చేస్తున్నారు.