సీఎం పర్యటనలో కలకలం
-బుక్కపట్నంలో చంద్రబాబు టూర్
-200 జిలెటిన్ స్టిక్స్ లభ్యం
అనంతపురం: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కలకలం రేగింది. పుట్టపర్తి-బుక్కపట్నం రోడ్డు మార్గంలో సుమారు 200 జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు బుధవారం గుర్తించారు. చంద్రబాబు బుక్కపట్నంలో జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో బుధవారం పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గంలో బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టినపుడు ఈ జిలెటిన్ స్టిక్స్ బయటపడ్డాయి. జిలెటిన్ స్టిక్స్ హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పేలుళ్లకు ఉపయోగించేందుకు తెచ్చి ఉంటారని, మిగిలిపోయినవి పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాలం చెల్లిన జిలెటిన్ స్టిక్స్ కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.