అమ్మ పాలు అమృతం కంటే తీయనివి.
అన్నానగర్: అమ్మ పాలు అమృతం కంటే తీయనివి. తన రక్తాన్ని పాలుగా మార్చి పిల్లలకు ఇస్తుంది. అలాంటిది ఆ తల్లిపాలు విషం అయ్యాయి. పాలు తాగి పడుకున్న ఆ చిన్నారులు శాశ్వతంగా ఆతల్లిని విడిచివెళ్లారు. తల్లిపాలు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన నాగర్‌కోవిల్‌లో జరిగింది. కుమరి జిల్లా పుత్తన్‌దుర్ ప్రాంతంలో ఉన్న కాట్రాడిత్తడికి చెందిన కన్నన్(39) భార్య దివ్య (29). వీరికి అనుష్క(02)అనే కుమార్తె ఉంది. దివ్యకి 22వ తేదీన ఇద్దరు కవలలు జన్మించారు. వీరికి ఆమె శుక్రవారం ఉదయం పాలు ఇచ్చి నిద్రపుచ్చింది. అయితే కొద్దిసేపటికే ఆ ఇద్దరు పసికందులు మృతి చెందారు.
దీంతో బంధువులు, స్థానికులు సంఘటనా స్థలానికి వచ్చి తల్లిపాలు తాగితే మృతి చెందరని.. ఊపిరి ఆడకుండా మృతిచెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తరువాత పసికందులను పూడ్చివేశారు. ఈ సంఘటనపై కుమరి జిల్లా పిల్లల రక్షణ అధికారి కుముదాకి అందిన సమాచారం మేరకు దివ్య ఇంటికి వెళ్లి విచారణ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న కోట్టూరు పోలీసులు కేసు నమోదు చేసి కన్నన్, దివ్యలను విచారిస్తున్నారు.