
పలుమార్లు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన ఓ స్కూటర్ యజమానికి రాచనగరి పోలీసులు షాకిచ్చారు.
మైసూరు : పలుమార్లు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన ఓ స్కూటర్ యజమానికి రాచనగరి పోలీసులు షాకిచ్చారు. ఏకంగా రూ. 63,500 ఫైన్ కట్టమని నోటీసు జారీ చేశారు. దీంతో సదరు వాహనదారుడు స్కూటర్ విక్రయించినా అంత ధర రాదు, వాహనం మీరో ఉంచుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు... కర్ణాటకలోని మైసూరు నగరానికి చెందిన మధుకుమార్ కొన్నాళ్లుగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్లు గుర్తించారు.
శుక్రవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా కే.ఏ.09 హెచ్‌డి.4732 నంబర్ కలిగిన స్కూటర్‌ను గుర్తించారు. అప్పటి నంచి లెక్క కట్టగా 635 కేసులు ఆ స్కూటర్‌పై నమోదు కావడంతో పోలీసులు ఏకంగా లెక్కకట్టి రూ. 63,500 ఫైన్ కట్టమని రశీదు ఇచ్చారు. దీంతో నివ్వెరపోయిన సదరు స్కూటర్ యజమాని వాహనం అమ్మినా అంత ధర రాదని, వాహనం మీరో ఉంచుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు ఏమి చేయాలో దిక్కుతోచక నిలబడిపోయారు.