
టవర్ ఎక్కించిన మత్తు
తాగిన మైకంలో ఓ వ్యక్తి ఎయిర్‌టెల్ సెల్ టవర్ ఎక్కి స్థానికుల్లో ఉత్కంఠ రేపాడు...
- చడానికి నానా తంటాలు పడ్డ అగ్రిమాపక సిబ్బంది
కోలారు : తాగిన మైకంలో ఓ వ్యక్తి ఎయిర్‌టెల్ సెల్ టవర్ ఎక్కి స్థానికుల్లో ఉత్కంఠ రేపాడు. నగరంలోని గాంధీ నగర్ రెండవ క్రాస్‌లో ఉన్న శ్రీనివాస్(45) ఉదయం మద్యం సేవించి దగ్గరలోనే ఉన్న ఎయిర్‌టెల్ టవర్ ఎక్కేశాడు. సుమారు 110 అడుగుల ఎత్తున్న టవర్ దాదాపు సగ ం వరకు వెళ్లి దిగిరావడానికి ససేమిరా అన్నాడు. అంతే కాకుండా కొద్ది సేపయ్యాక మగతలోకి జారుకున్నాడు. దీనిని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఎయిర్ టెల్ సిబ్బంది సిగ్నల్‌ను ఆపు చేయించారు. అగ్ని మాపక సిబ్బంది ముగ్గురు టవర్ పైకి ఎక్కి శ్రీనివాస్‌ను లేపగా తాను ఇంట్లోనే పడుకుని అన్నానని తాపీగా సమాధానం చెప్పాడు. కిందికి దిగమంటే తాను ఇంట్లోనే ఉన్నానంటూ సమాధానం చెప్పి కిందికి దిగిరావడానికి ఒప్పుకోలేదు. తాగిన మైకంలో ఉన్న శ్రీనివాస్‌ను కిందికి దించడానికి అగ్నిమాపక సిబ్బందికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. జిల్లా అగ్నిమాపక దళ అధికారి పి.ఎం.నాగరాజ్, మునిరాజు, విశ్వనాథ్ టవర్ పైకి ఎక్కి శ్రీనివాస్ నడుముకు తాడు కట్టి మునిరాజు భుజంపై కూర్చో బెట్టుకుని నిదానంగా కిందికి దించారు.
శ్రీనివాస్‌ను కిందికి దించగానే స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది చర్యను కొనియాడారు. అనంతరం గల్‌పేట పోలీసులు శ్రీనివాస్‌ను స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. ఎవరూ టవర్‌లు ఎక్కకుండా ఆయా కంపెనీలు తమ టవర్‌ల వద్ద భద్రతను కల్పించాల్పి ఉందని అగ్నిమాపక అధికారి నాగరాజ్ తెలిపారు.