నవంబర్ 26 ఉగ్రవాద దాడిలో అసువులుబాసిన వారికి ఇండో-అమెరికన్, అమెరికన్ యూదు సమాజం ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది.
న్యూయార్క్/ముంబై: నవంబర్ 26 ఉగ్రవాద దాడిలో అసువులుబాసిన వారికి ఇండో-అమెరికన్, అమెరికన్ యూదు సమాజం ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది. 26/11 ఉగ్రవాద నరహంతక దాడి జరిగి ఐదేళ్లు గడిచిన సందర్భంగా మంగళవారం నాడు అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ ఆసియా ఫసిఫిక్ రీజియన్ యూదు కమిటీ మౌనం పాటించి కొవ్వొత్తులు వెలిగించింది. పాక్ ప్రేరేపిత లష్కరే మూకలు చేసిన దాడిలో మరణించిన వారికి న్యాయం జరగాలని కోరింది. యూదు ప్రార్థనా మందిరం మీద చేసిన హంతక దాడిలో ఉగ్రవాదులు పలు దేశాలకు చెందిన యూదులు మరణించారు. గావ్రీయేల్ నోచ్ హోల్టే జ్‌బెర్గ్, ఆయన సతీమణి రివాకలు కూడా మృతి చెందిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ కాన్సూల్ జనరల్, రాయబారి ద్యానేశ్వర్ ములూ మాట్లాడుతూ ‘‘ఉగ్రవాదం అనేదానికి మతం, కులం, ప్రాంతం, దేశం అనేదిలేదు. 21వ శతాబ్దిలో పెచ్చరిల్లిన ఉగ్రవాదాన్ని మరింత సమైక్యంగా ఎదుర్కొని ఓడించాల్సిన సమయం ఆసన్నమయింది.
భారతదేశం అనేక సంవత్సరాలుగా ఉగ్రవాద బెడద ఎదుర్కొంటోంది. అయితే సెప్టెంర్ 11 దాడులకు ముందు దాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు. పెరుగుతున్న ఈ ప్రమాదాన్ని అంతర్జాతీయ వేదికల మీద హెచ్చరించలేదు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే కాదు, దాన్ని జాతీయ విధానంగా ఆచరిస్తున్నాయి. జరిగిన సంఘటనల నుంచి పాఠాలను నేర్చుకోవాల్సిందే. ఉగ్రవాదం అనే ఈ పదాన్ని తుడిచి పెట్టడానికి సంఘటితంగా పోరాడాల్సి ఉంది. మానవాళి విశాల ప్రయోజనాల కోసం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధిం చాలి’’ అని ప్రకటించారు. ఇజ్రాయెల్ కాన్సూల్ జనరల్, రాయబారి ఇదో అహరోణి మాట్లాడుతూ‘‘పక్కా సమన్వయంతో ముంబైలో పలు అంచెలుగా జరిగిన ఉగ్రవాద దాడి భారత్‌ను ఇజ్రాయెల్‌కు సన్నిహితం చేసింది.
ప్రపంచంలోని ఏ దేశంతో జరిగే ఒప్పందం సందర్భంగానైనా ఉగ్రవాద నిరోధక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలకు చెందిన చిన్న బృందంలో భారత్, ఇజ్రాయెల్‌లు ఇప్పుడు సభ్యులు’’ అన్నారు. అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీశ్ సేవ్హాని మాట్లాడుతూ ‘‘నవంబర్ 26 ఉగ్రవాద దాడిపై జరిగిన న్యాయవిచారణ, వచ్చిన తీర్పుతో పాకిస్తాన్ మెల్కోనాలి. అయితే పాక్ ప్రభుత్వం ఈ దాడుల కుట్రకు సూత్రదారి హాఫీజ్ సయీద్‌పై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఉగ్రవాద దాడులు బెడదను పలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఇండియా, ఇజ్రాయిల్, అమెరికాలు దీన్ని ఓడించడానికి ఉమ్మడిగా పోరాడాలి’’ అన్నారు.