ఆప్ డప్పు తప్పు!
అధికారంలో కొద్దిరోజులే ఉన్నప్పటికీ తమ పాలనలో ఢిల్లీలో అవినీతి తగ్గిపోయిందంటూ అర్వింద్ కేజ్రీవాల్ తదితర ఆప్ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలిందన్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఖండించింది. అయితే తాము పొరబడ్డామంటూ ఆప్ చివరకు వివరణ ఇచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
తమ పాలనాకాలంలో ఢిల్లీలో అవినీతి తగ్గిపోయిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటోన్న మాటలలో నిజమెంత? అనే విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. అర్వింద్ కేజ్రీవాల్ హయాంలో అవినీతి తగ్గిందంటూ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా అధ్యయనంలో తేలిందని ఆప్ నేతలు ఎంతో ఘనంగా చెప్పుకున్నారు.
అయితే తాము అలాంటి అధ్యయనమేదీ నిర్వహించలేదని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ ఓ ప్రకటనలో తేల్చిచెప్పింది. దీంతో తమ తప్పిదానికి క్షమాపణ చెప్పింది. సోమవారం మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సీఐఐ సమావేశంలో వాణిజ్యవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ పాలనలో ఢిల్లీలో అవినీతి తగ్గిందని, ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో అవినీతి తగ్గిందని తెలిపే నివేదికను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేయనున్నట్లు తనకు తెలిసిందన్నారు. అంతకుమునపు ఆప్ నేత షాజియా ఇల్మీ కూడా ఇలాంటి మాటలే చెప్పారు.
ఢిల్లీలో అవినీతి తగ్గిపోయిందంటూ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే వెల్లడించిందని ఆప్ నేత షాజియా.... హిందుస్తాన్ టైమ్స్ ఆంగ్ల దినపత్రిక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఢిల్లీలో అవినీతిపై ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ అధ్యయనం జరిపించిందని, ఆప్ 45 రోజుల పాలనపై ఆ సంస్థ ఇంకా ప్రచురించని నివేదిక పేర్కొందని, ఇది ఆప్ సాధించిన ఘన విజయమని షాజియా ఇల్మీ చెప్పిట్లుగా హిందుస్తాన్ టైమ్స్‌లో ఓ వార్త ప్రచురితమైంది.
అదేమీ లేదు: అశుతోష్
అయితే దీనిని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండి యా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశుతోశ్‌కుమార్ మిశ్రా ఖండించారు. షాజియా మాటలు నిజం కాదని, తాము ఢి ల్లీలో అవినీతిపై ఎలాంటి అధ్యయనం జరపలేదని అందువల్ల దీనికి సంబంధించి ప్రచురిత , అప్రచురిత నివే దిక ఏదీ లేదని పత్రికాప్రకటన ద్వారా స్పష్టం చేసింది. నివేదిక విషయంలో పొరపాటు పడినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ క్షమాపణ తెలిపింది.
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ పట్ల తమ కు గౌరవం ఉందని, సర్వే విషయంలో తమ పొరపాటు వల్ల ఆ సంస్థకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నామని, ఇందుకు క్షమించాలని పార్టీ కోరింది. షాజియాకు సర్వే గురించి తెలిపిన వ్యక్తి ఆ సంస్థ నుంచి వైదొలగినట్లు ఆప్ తెలిపింది. దీనిపై షాజియా ప్రతిస్పందిస్తూ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ కావచ్చు లేదా ఒపాసిటీ ఇంటర్నేషనల్ కావచ్చు. ఏదైతేనేం ఢిల్లీలో అవినీతి తగ్గిందన్నది మాత్రం నిజమని చెప్పారు.