ఆప్.. మునుగుతున్న ఓడ!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీని మునుగుతున్న ఓడగా అభివర్ణించారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్షవర్ధన్. ఆ పార్టీ చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటని, ఆ పార్టీ నేతల్లో కొందరి భ్రమలు ఇప్పుడిప్పుడే తొలగుతున్నాయని, ప్రజల్లో కూడా ఆ పార్టీపై అసంతృప్తి పెరుగుతోందన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షవర్ధన్ మాట్లాడుతూ... ఆప్‌పై ఆ పార్టీ తరఫున పనిచేసినవారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి భ్రమలు తొలగిపోతున్నాయని చెప్పారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పూర్తిగా కనుమరుగైందని, పార్టీ వ్యవస్థాపకుల్లో కీలక సభ్యులే ఆ పార్టీ పనిచేస్తున్న తీరును విమర్శిస్తున్నారని వర్ధన్ ఎద్దేవా చేశారు. విదేశీ సంస్థలతో ఆ పార్టీకి సంబంధాలున్నాయనే విషయం ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోందన్నారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అశోక్ అగర్వాల్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పారు. పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా పనిచేస్తోందని అగర్వాల్ విమర్శించడాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావించారు. వ్యక్తిగతంగా కొందరికి లబ్ది చేకూర్చేందుకే కేజ్రీవాల్ పనిచేస్తున్నట్లుగా ఉందని అగర్వాల్ విమర్శించడాన్ని హర్షవర్ధన్ సమర్థించారు.