న్యూఢిల్లీ : మరో ఆప్ ఎమ్మెల్యే వివాదాల్లో చిక్కుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన సంఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే సరితా సింగ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే కారు డ్రైవర్ ... పోలీసులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వివాదం నెలకొంది. అయితే ఈ ప్రమాదం నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఓం పాల్ గాయాలతో బయటపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులకు, డ్రైవర్ కు మధ్య వాగ్వివాదం జరిగింది.
దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే సరితా సింగ్..పోలీసులను బెదిరించటమే కాకుండా అసభ్యంగా దుర్భాషలాడారు. ఈ సంఘటన ఢిల్లీలోని రోహ్‌తాస్ నగర్ ఏరియాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇదంతా ఓ వ్యక్తి తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించటంతో, అదికాస్త మీడియాలో వైరల్ అయింది. కాగా పోలీస్ అధికారి ఓం పాల్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సరితా సింగ్ పై కేసు నమోదు అయింది. సెక్షన్ 186, 279ల కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ వీను బన్సాల్ తెలిపారు.
కాగా జరిగిన సంఘటనపై తాను కూడా బజన్పూరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే సరితా సింగ్ తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారులను కలిసి జరిగిన సంఘటనను వివరిస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే ఆప్ పార్టీ ఎమ్మెల్యే అయినందువల్లే పోలీసులు తమపై ఆరోపణలు చేసి, వేధింపులకు గురి చేస్తున్నారని సరితా సింగ్ ఆరోపించారు.
వివాదంలో ఆప్ ఎమ్మెల్యే సరితా సింగ్
Published Mon, Nov 23 2015 11:18 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement