పోలీసులపై పట్టు కావాలి
Published Wed, Jan 15 2014 11:26 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ:నగర పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చర్చలు జరిపే అవకాశముందని తెలుస్తోంది. నగరంలో మంగళవారం డెన్మార్క్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం నేపథ్యంలో ఆప్ సర్కార్ అప్రమత్తమైంది. ఇలాంటి నేరాలను అరికట్టాలంటే ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని, అప్పుడే జవాబుదారీతనం ఉంటుందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా బుధవారం మీడియాకు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను మరింత పటిష్టం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ‘నగరంలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మహిళలపై నేరాల విషయాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో మాట్లాడారు.
గతేడాదిలో జరిగిన అత్యాచారాలపై సీఎం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్, పోలీసు కమిషనర్‌లు సమావేశమై సమీక్షిస్తార’ని ఆయన చెప్పారు. అన్ని అత్యాచార కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదలాయించాలని, అప్పుడే నిందితులకు కఠిన శిక్ష పడే అవకాశముంటుందన్నారు. ఈ మేరకు భారత్ ప్రధాన న్యాయమూర్తిని కలసి కోరతామన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తే నేరాలను నియంత్రించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు ప్రత్యేకంగా రాష్ట్ర హోంశాఖ మంత్రిని నియమిస్తే, ఆయనే శాంతి భద్రతల సమస్యను పర్యవేక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఏ నేరం జరిగినా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికే సమయం వృథా అవుతోందని అన్నారు.
ఢిల్లీ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలనే అంశం తమ పాత డిమాండేనని, ఈ విషయంపై సీఎం కేజ్రీవాల్ కేంద్రంతో మాట్లాడతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పోలీ సులు ఉన్నంతవరకు సరిగా విధులు నిర్వర్తించలేరని వ్యాఖ్యానించారు. భారత్‌లో పర్యటన కోసం ఈ నెల ఒకటిన ఢిల్లీకి వచ్చిన డెన్మార్కు మహిళ మంగళవారం సాయంత్రం ఓ మ్యూజియంను సందర్శించి తిరిగి వచ్చే క్రమంలో పహర్‌గంజ్‌లో తాను ఉంటున్న అడ్రస్ దొరక్క తికమక పడింది. అయితే కొంతమంది వ్యక్తులు ఆమెను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె ఐపాడ్, నగదును తీసుకున్నారు. ఆరుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Advertisement
Advertisement