విధానసభ రెండు రోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు స్పీకర్,
సాక్షి, న్యూఢిల్లీ : విధానసభ రెండు రోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకున్నారు. రామ్‌నివాస్ గోయల్ స్పీకర్‌గా, వందనా కుమారి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
విధానసభ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన 67 మంది ఆప్ సభ్యులతో పాటు ముగ్గురు బీజేపీ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి గోపాల్‌రాయ్ అందరికంటే ముందు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన చౌదరి ఫతేసింగ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత స్పీకర్, డిప్యూటీ స్పీక ర్ల ఎన్నిక జరిగింది. షహదరా ఎమ్మెల్యే రామ్‌నివాస్ గోయల్‌ను స్పీకర్‌గా, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే వందనా కుమారిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన రామ్ నివాస్ గోయల్‌ను ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ పోడియం వద్దకు తీసుకెళ్లారు.
లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం విధానసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగంలో ఆప్ సర్కారు విధానాలు ప్రతిబింబించనున్నాయి. మహిళల భద్రతపట్ల ప్రభుత్వానికి గల నిబద్ధత, అధికార యంత్రాంగంలో అవినీతిని నిర్మూలన, విద్యుత్తు, నీటి సరఫరా అంశాలతోపాటు నగరవాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎల్జీ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. ఆ తరువాత విద్యుత్తు చార్జీల తగ్గింపు, ఉచిత నీటి సరఫరా వంటి ఎన్నికల హామీలపై ప్రభుత్వం చర్చ జరపాలనుకుంటోంది. అయితే సమయాభావం కారణంగా విస్తృత చర్చ జరిగే అవకాశం లేదు. చర్చ అనంతరం ధన్యవాద తీర్మానంతో ఈ సమావేశాలు ముగుస్తాయి. 70 మంది సభ్యులున్న ఢిల్లీ విధానసభ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా తొలిసారిగా జరుగుతున్నాయి. బీజేపీ సభ్యులు కూడా ముగ్గురే ఉండడంతో ప్రతిపక్ష పాత్రినిధ్యం నామమాత్రమైపోయింది.