సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జాతీయ రాజధానిలో సుమారు 40 వేలమంది ఓటర్లు ‘నోటా’(పై ఎవరూ కాదు)ను ఆశ్రయించారు.
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జాతీయ రాజధానిలో సుమారు 40 వేలమంది ఓటర్లు ‘నోటా’(పై ఎవరూ కాదు)ను ఆశ్రయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఈసారి నోటాకు ఓటేసిన వారి శాతం తగ్గిందనే చెప్పవచ్చు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 49,884 (0.63 శాతం) మంది నోటాను ఆశ్రయించారు. కాగా, ఈసారి 39,690 (0.5 శాతం) మంది మాత్రమే నోటా నొక్కారు. ‘ప్రజలకు రాజకీయ వ్యవస్థ మీద అవగాహన పెంచడం కోసం ‘నోటా’ను ప్రవేశపెట్టాం. ప్రస్తుత ఎన్నికల్లో కేవలం 0.5 శాతం ఓటర్లే దీనికి ఓటేశారు. అంటే రాజకీయ వ్యవస్థ ద్వారానే తమ సమస్యలు పరిష్కారమవుతాయని 99 శాతానికిపైగా ఓటర్లు నమ్మకం కలిగి ఉన్నారని పోలింగ్ ద్వారా స్పష్టమైంది.. ఇది అభినందనీయం..’ అని పోలింగ్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీలో ఏడు లోక్‌సభ నియోజకవర్గాలుండగా, ఒక్క వాయవ్య ఢిల్లీలో అత్యధికంగా 8,826 మంది నోటా నొక్కగా, అత్యల్పంగా ఈశాన్య ఢిల్లీలో 3,824 మంది నోటాను ఆశ్రయించారు. 2013 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొట్టమొదటిసారిగా ఢిల్లీలో ఎన్నికల అధికారులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎంలలో) నోటాను ప్రవేశపెట్టారు. స్థానికంగా నిలబడిన అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే, సదరు ఓటరు ‘నోటా’ను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించారు.