మంత్రి వైద్యలింగానికి తప్పిన ప్రమాదం
Published Mon, Dec 16 2013 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
సాక్షి, చెన్నై:సేలం జిల్లా ఏర్కాడు ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ పెరుమాళ్ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ విజయోత్సవాన్ని శనివారం రాత్రి తంబపట్టిలో నిర్వహించారు. ఇందులో మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, ఎడపాడి పళని స్వామి, ఆర్ వైద్యలింగం పాల్గొంటారని ప్రకటించారు. ముందుగానే అక్కడికి వైద్యలింగం మినహా తక్కిన మంత్రు లు చేరుకున్నారు. తంజావూరు నుంచి సాయంత్రం సేలం జిల్లా తంబం పట్టికి మంత్రి వైద్యలింగం బయలు దేరారు. తంజావూరు కలెక్టర్‌కు చెందిన వీపీఐలు పయనించే ఇన్నోవాలో మంత్రితో పాటుగా ఆరుగురు పయనించారు. తంజావూరులోనే ఈ వాహనం అతివేగంగా దూసుకెళ్లింది. రాత్రి ఏడు గంటల పుదూరు రోడ్డు గుండా తంబం పట్టికి ఇన్నోవా పయనిస్తున్న వేళ, ఆ మార్గంలోని ఎస్ సర్కిల్లో వాహనం అదుపు తప్పింది. డ్రైవర్ కళియమూర్తి వాహనాన్ని కట్టడి చేయలేక పోయాడు. చివరకు ఓ చెట్టును ఢీ కొట్టి ఇన్నోవా ఆగింది. అందులో ఉన్న వాళ్లు అదృష్ట వశాత్తు సురక్షితంగా బయట పడ్డారు.
సమాచారం అందుకున్న మరో మంత్రి ఎడపాడి పళని స్వామి తన వాహనాన్ని సంఘటనా స్థలానికి పంపించారు. డ్రైవర్ ఉన్న వైపుగా వాహనం చెట్టును ఢీ కొన్నా, ముందు కూర్చొని ఉన్న మంత్రికి, వెనుక ఉన్న వాళ్లకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న మల్లియకరై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. త్వరితగతిన తంబం పట్టి చేరుకోవాలన్న ఉద్దేశంతో వాహనాన్ని డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. గతంలో చెన్నైకు త్వరితగతిన చేరుకోవాలన్న వేగంతో డ్రైవర్ అతి వేగంగా కారు నడపడంతో చోటు చేసుకున్న ప్రమాదంలో మంత్రి మరియం పిచ్చై బలైన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement