వేడెక్కిన ఉప సమరం
Published Fri, Nov 22 2013 2:20 AM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఏర్కాడు ఉప ఎన్నికల పోలింగ్‌కు 13 రోజులే గడువు ఉండటంతో నియోజకవర్గంలో ఎన్నికల వేడి పుంజుకుంది. అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ గెలుపుకోసం ఈనెల 28న సీఎం జయలలిత సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యూరు. ఏర్కాడు ఎమ్మెల్యే పెరుమాళ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అన్నాడీఎంకే తరపున పెరుమాళ్ సతీమణి సరోజ, డీఎంకే తరపున నాగమారన్ ప్రధాన అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. వీరుకాక మరో 9 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థి గెలుపుకోసం జయలలిత ఇప్పటికే మంత్రి వర్గ బృందాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. వారంతా ప్రచారంలో ముని గిపోయివుండగా 28వ తేదీన సీఎం స్వయంగా ప్రచారంలోకి దిగనుండడం పార్టీ శ్రేణులను ఆనందంలో ముంచెత్తుతోంది.
కేవలం ఆ ఒక్కరోజునే ఏర్కాడు నియోజకవర్గ పరిధిలోని 9 చోట్ల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తారు. సీఎం సుడిగాలి పర్యటనకు పార్టీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి డీఎంకే తరపున పోటీ చేస్తున్న నాగమారన్‌ను ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కించాలని ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ప్రయత్నాలు చేస్తున్నారు. అరుుతే వృద్ధాప్యం వల్ల డీఎంకే అధినేత కరుణానిధి ఏర్కాడుకు వెళ్లకపోరుునా ఆయన కుమారుడు, పార్టీ కోశాధికారి స్టాలిన్ పర్యటించే అవకాశం ఉంది. అయితే ఇంకా తేదీ ఖరారు కాలేదు. సీఎం జయ పర్యటనలో డీఎంకేకు వ్యతిరేకంగా సాగే విమర్శలను తిప్పికొట్టేందుకు వీలుగా ఆ తరువాతనే స్టాలిన్ పర్యటనకు సిద్ధపడే అవకాశం ఉంది.
మంత్రికి సంజాయిషీ నోటీసు
రాష్ట్ర రహదారుల శాఖా మంత్రి ఎన్నికల నిబంధనలను ధిక్కరించారని ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఏర్కాడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ గత నెల 4 వతేదీన జారీ అయినందున ఆ నాటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన అన్నారు. ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన అధికారి ఈనెల 16న మంత్రి ఇంటికి వెళ్లి గంటకు పైగా గడిపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి మంత్రిపై చర్య తీసుకోవలసిందిగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై 48 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాల్సిందిగా మంత్రి పళనిసామికి ఎన్నికల కమిషన్ గురువారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారాలను వీడియోలో చిత్రీకరించే ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో 13 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌ను నియమించారు.
Advertisement
Advertisement