‘యాసిడ్ దాడి’ నిందితుడికి జీవితఖైదు
Published Thu, Sep 5 2013 4:37 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
న్యూఢిల్లీ: యాసిడ్‌తో దాడిచేసి ఇద్దరు అన్నదమ్ముల మృతికి కారణమైన వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ బుధవారం ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. ఇదే కేసులో మొదట సాక్ష్యులుగా ఉండి, తర్వాత మాటమార్చిన ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీచేసింది.
వివరాల్లోకి వెళితే.. నిందితుడు సంజయ్ పశ్చిమ ఢిల్లీలోని భావనలో ఉన్న స్టీల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ పక్కనే ఉన్న ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్న ధనుంజయ్, అతడి సోదరుడు అక్షయ్‌లపై 2009 అక్టోబర్ 24వ తేదీన యాసిడ్‌తో దాడిచేశాడు. గాలిన గాయాలతో వారిద్దరూ మృతిచెందారు. మృతులతో కలిసి పనిచేస్తున్న రిషి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో సంజయ్ పనిచేసిన కంపెనీ యజమాని కూడా సాక్ష్యం ఇచ్చాడు. కాగా, పోలీసుల విచారణలో తాను పనిచేస్తున్న కంపెనీలో వైర్ల నుంచి తుప్పును కరిగించేందుకు వినియోగించే నైట్రిక్ యాసిడ్‌ను సేకరించి, బాధితులపై దాడిచేసినట్లు తెలిపాడు.
కాగా, ఈ కేసులో మొదట సాక్ష్యులుగా నిలబడిన సంజయ్ సహోద్యోగులు కోర్టులో ఎదురుతిరగడంతో, కోర్టును తప్పుదారి పట్టించేందుకు యత్నించినందుకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈ నెల 23 లోగా తెలియజేయాలని షోకాజ్ నోటీసు జారీచేయాలని కోర్టు ఆదేశించింది.
Advertisement
Advertisement