
బుజ్జిమేక బుజ్జిమేక ఏమి చేస్తివే..
బుజ్జి మేకను తెచ్చి ఏకంగా లాకప్లో బంధించారు పర్భనీ జిల్లా ఖాకీలు.
మోసగాళ్లు, నేరస్తుల సంగతేమోగానీ పక్షులు, జంతువులను కటకటాల్లోకి నెట్టేస్తున్నారు మహారాష్ట్ర పోలీసులు. మొన్నటికిమొన్న ఓ బామ్మను బండబూతులు తిట్టిందని రామచిలుకను స్టేషన్కు రప్పించి, ఆ తరువాత దానిని అటవీశాఖకు అప్పగించారు చంద్రపూర్ జిల్లా పోలీసులు. ఇప్పుడేమో ఒక బుజ్జి మేకను తెచ్చి ఏకంగా లాకప్లో బంధించారు పర్భనీ జిల్లా ఖాకీలు. వివరాల్లోకి వెళితే..
కొద్ది రోజుల కిందట పర్బనీ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో దొంగలు పడ్డారు. డబ్బు, నగల జోలికిపోకుండా వందల సంఖ్యలో కోళ్లు, మేకలు, గొర్రెలను ఎత్తుకెళ్లారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ జల్లెడపట్టారు. అలా వెతుకుతూ ఉండగా ఓ ఇంటిముందు బుజ్జిమేక కనిపించింది. సదరు ఇంటి యజమానిని తమదైన శైలిలో ప్రశ్నించగా.. ఆ మేక దొంగతనం చేసిన వాటిలోదేనని తేలింది.
దీంతో మేకతోసహా నిందితుడిని స్టేషన్కు తీసుకొచ్చిన పోలీసులు.. మేకను, నిందితుడిని వేరువేరు లాకప్లలో ఉంచారు. దొంగతనానికి గురైన అన్ని పశువులు దొరికిన తర్వాత వాటిని కోర్టుకు అప్పగిస్తామని, జడ్జిగారు ఆదేశించాకగానీ ఎవరి మేకలను వారికి ఇవ్వబోమని స్పష్టం చేశారు పర్భనీ పోలీసులు. ఎవరో చేసిన దొంగతనం బుజ్జిమేక స్వచ్ఛను హరించింది.