చెన్నై, సాక్షి ప్రతినిధి:అన్నాడీఎంకే మద్దతిచ్చే కూటమే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత ధీమా వ్యక్తం చేశారు. అందుకే తమ పార్టీ మ్యానిఫెస్టోను రాష్ట్రంతోపాటూ దేశ ప్రగతి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే మ్యానిఫెస్టోను మంగళవారం మధ్యాహ్నం 12.45 గంటలకు పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టో ద్వారా 43 వాగ్దానాలు చేశారు. మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన 24 గంటల్లోనే మ్యానిఫెస్టో కూడా విడుదల చేసి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశారు. 40 స్థానాలను గెలుచుకోవడం ద్వారా అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ప్రధానిని చేయాలని పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. తమిళులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్తావించడం ద్వారా ఆశించిన స్థాయి గెలుపును అందుకోవాలని ఆమె ఆశిస్తున్నారు. ఇవే మేనిఫెస్టో ప్రధాన అంశాలు.
- శ్రీలంక మారణహోమానికి కారకులైనవారిని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టడం.
- ప్రత్యేక తమిళ ఈలంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళుల నుంచి అభిప్రాయ సేకరణ.
- కూటమి పార్టీల సిద్ధాంతాలకు కట్టుబడి నిర్ణయాలను అమలు చేయడం
- శ్రీలంక- తమిళ మత్స్యకారుల చర్చలకు చర్యలు
- భారత జాలర్ల సంక్షేమానికి జాతీయ స్థాయిలో నిధి
- ఎఫ్‌డీఐ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు చర్యలు
- తమిళభాషకు జాతీయ అధికార భాషగా గుర్తింపుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక
- కేంద్రం అమలుచేస్తున్న ఆహారభద్రతా చట్టానికి బదులుగా ప్రతిఒక్కరికీ లబ్ధి చేకూరేలా చట్టంలో మార్పులు
- రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా 65,140 కిలోలీటర్ల కిరోసిన్ సాధన
- విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉండే రాష్ట్రాల నుంచి విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు మిగులు విద్యుత్ సరఫరాకు ప్రత్యేక విధానం
- కావేరీ పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు చర్యలు, నదుల అనుసంధానం
- రాష్ట్రంలో అమలుచేస్తున్న విధంగా జాతీయ స్థాయిలో మహిళా సాధికారత పథకాలు, నిబద్ధతతో రిజర్వేషన్లు
- ప్రభుత్వ రంగ సంస్థల్లోని షేర్లను ప్రైవేటు సంస్థలకు విక్రయించకుండా ప్రభుత్వమే స్వీకరించడం
- ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు శాశ్వతస్థానానికి అన్నాడీఎంకే కృషి
- అన్నాడీఎంకే మద్దతు ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పక్షంలో విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించడం
- మతం మారిన అదిద్రావిడులను రిజర్వేషన్ కేటగిరి కిందకు తీసుకురావడం
- విదేశీ వర్తకం దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతుంది కాబట్టి స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలకు భరోసా కల్పిస్తూ విదేశీ ఎగుమతులను ప్రోత్సహిస్తామని ఆమె తన మేనిఫోస్టోలో పేర్కొన్నారు.