ఆ మంత్రులకు చుక్కలు చూపిస్తున్నారు...
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే మంత్రులకు ఎన్నికల ప్రచారాల్లో కష్టాలు తప్పడం లేదు. ఓటర్లు నిలదీస్తుండడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఏకంగా ఇద్దరు మంత్రులు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ఉడాయించి ఉన్నారు. రాష్ట్ర మంత్రుల్లో పదిహేను మంది వరకు మళ్లీ సీట్లను దక్కించుకుని ఉన్నారు. వీళ్లల్లో పలువురు తమ సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఐదారుగురు స్థానాల్ని మార్చారు. ఎక్కడ సిట్టింగ్ సీట్లలో పోటీ చేస్తే ఓటమి చవి చూడాల్సి వస్తుందో అన్న భయమేనట.
సీట్లు మార్చుకున్నా వదిలి పెట్టమన్నట్టుగా ఓటర్లు మంత్రులకు చుక్కలు చూపించే పనిలో పడ్డారు. ఓట్ల వేటలో ఉన్న పలువురు మంత్రులకు అనేక చోట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతూ వస్తున్నది. సిట్టింగ్ సీట్ల రేసులో ఉన్న వాళ్లకు గతంలో ఇచ్చిన హామీల సెగ తగులుతుండడం గమనార్హం. చెప్పారే....చేశారా..! అని నిలదీసే వాళ్లు పెరుగుతుండడంతో ఆ మంత్రులు ఉక్కిరిబిక్కిరి అవుతోన్నారు. సోమవారం ఇద్దరు మంత్రులకు ఓటర్లు చుక్కల్నే చూపించారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే ఘటనలు చోటు చేసుకున్నాయి.
పాపిరెడ్డి పట్టి నుంచి ఎన్నికల రేసులో ఉన్న మంత్రి పళనియప్పన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు చోట్ల పర్యటించగా, అన్ని చోట్ల వ్యతిరేకత తప్పలేదట! చెప్పారే...చేశారా.. అని నిలదీస్తూ, నియోజకవర్గం పరిధిలో మెడకురిచ్చి, నత్తమడం గ్రామాల వైపుగా ఆయన్ను రానివ్వకుండా, రోడ్డు అడ్డంగా చెట్లను నరికి వేయడం గమనార్హం. అటు వైపుగా వెళ్ల లేని పరిస్థితి రావడంతో పళనియప్పన్ టేక్ డైవర్షన్ తీసుకోవాల్సి వచ్చిందట. ఇక, మంత్రి మోహన్‌నూ ఓటర్లు వదలి పెట్టలేదు.
శంకరాపురం రేసులో ఉన్న మంత్రి మోహన్‌ను ఎన్నికల ప్రచారంలో ఓటర్లు నిలదీస్తున్నారట. గతంలో ఇచ్చిన హామీల చిట్టాను వివరిస్తూ ఓటర్లు ప్రశ్నల వర్షం కురిపించడంతో కొశపాకం గ్రామం నుంచి ఉడాయించక తప్పలేదు. మధురై మేలూరు అయితే, అన్నాడీఎంకే వర్గాలు ఇటు వైపుగా రాకూడదన్నట్టుగా ఉరగన పట్టి, తంబంపట్టి, మలైపట్టి గ్రామాలకు చెందిన ప్రజలు ముందుగానే అధ్వానంగా ఉన్న రోడ్లపై నల్ల గుడ్డ చుట్టి జెండాల రూపంలో అక్కడక్కడ పెట్టి ఉండడం గమనించాల్సిన విషయమే.
ఇలా మంత్రుల్ని ఓటర్లు పరుగులు పెట్టిస్తుంటే, రాష్ర్ట ఎన్నికల యంత్రాంగం ఈ మంత్రుల వ్యవహారాల్ని కనిపెట్టేందుకు ప్రత్యేకంగా 42 మంది ఎన్నికల పర్యవేక్షకుల్ని రంగంలోకి దించి ఉండడంతో జాగ్రత్తగా అడుగులు వేయడం మొదలెట్టి ఉన్నారు. ఇక, అమ్మ ఆశీస్సులతో తమకు మళ్లీ సీటు దక్కినా, ఓటర్లు కరుణిస్తారా..? అన్న బెంగ మంత్రుల్లో వెంటాడుతోన్నట్టుగా మద్దతుదారులు చెబుతున్నారు.