సాక్షి, చెన్నై : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం తిరుచ్చిలో పర్యటించనున్నారు. పొన్మలై జీ కార్నర్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు లక్ష మందికి అనుమతి కల్పించి ఉన్నారు. అలాగే, డెల్టా అన్నదాతలతో ప్రత్యేకంగా రాహుల్ భేటీ కానున్నారు. రాహుల్ రాకతో తిరుచ్చి నగరాన్ని భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకోవడం, తమ బలాన్ని చాటుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు సిద్ధం అయ్యారు. బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగడంతో పాటుగా తమ యువరాజు రాహుల్ రాష్ట్రంలో పలు మార్లు పర్యటనలు చేపట్టే రీతిలో కార్యచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా డెల్టా అన్నదాతల కన్నీటి గోడును పరిగణలోకి తీసుకుని , వారికి భరోసా ఇచ్చే రీతిలో తిరుచ్చి వేదికగా బహిరంగ సభకు నిర్ణయించారు. ఇందు కోసం తిరుచ్చి పొన్మలైలోని జీకార్నర్ మైదానాన్ని వేదికగా ఎంపిక చేశారు. ఇక్కడ రాహుల్ రాక కోసం సర్వం సిద్ధం చేశారు.
నేడు రాహుల్ రాక: రాహుల్ రాకను పురస్కరించుకుని జీకార్నర్ మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు.తమ యువ రాజు దృష్టిలో పడే రీతిలో పలువురు నేతలు హంగు ఆర్బాటాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. 40 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. అలాగే, వేదికపై టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌తో పాటుగా మరో ముగ్గురు నాయకుల్ని మాత్రమే అనుమతించనున్నారు. రాహుల్ ప్రసంగించేందుకు వీలుగా బుల్లెట్ ఫ్రూఫ్‌తో కూడిన అద్దాలతో ప్రత్యేకంగా ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. అలాగే, మైదానంలోకి నాయకులు వచ్చేందుకు ఓ మార్గం, కార్యకర్తలు వచ్చేందుకు మరో మార్గం సిద్ధం చేశారు. ఈ మార్గాల్లో మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ అనంతరం ప్రతి ఒక్కర్నీ అనుమనిస్తారు. లక్ష మందిని మాత్రమే మైదానంలోకి అనుమతించేందుకు చర్యలు తీసుకున్నారు. రాహుల్ రాకను పురస్కరించుకుని కేంద్ర భద్రతా బృందం ఐజీ రావత్ నేతృత్వంలో 14 మంది అధికారులు తిరుచ్చికి చేరుకుని భద్రతను పర్యవేక్షిస్తున్నారు. తిరుచ్చి జిల్లా పోలీసు యంత్రాంగం నేతృత్వంలో 2500 మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు.
రాహుల్ పర్యటన సాగే అన్ని ప్రాంతాల్ని బుధవారం ఈ బృందం పరిశీలించింది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలు దేరి తిరుచ్చి విమానాశ్రయం చేరుకునే రాహుల్‌కు ఘన స్వాగతం పలకడంతో పాటుగా, దారి పొడవునా ఆహ్వానాలు పలికే రీతిలో కాంగ్రెస్ వర్గాలు ఏర్పాట్లు చేసి ఉన్నాయి. తిరుచ్చి విమానాశ్రయం నుంచి పుదుకోట్టై రోడ్డు మీదుగా పొన్మలై జీ కార్నర్ మైదానానికి సాయంత్రం ఐదు గంటలకు రాహుల్ చేరుకుంటారు. పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు, అన్నదాతల్ని ఉద్దేశించి బహిరంగ సభలో రాహుల్ ప్రసగించనున్నారు. అనంతరం తిరుచ్చి విమానాశ్రయం వెళ్లే మార్గంలో పదమనల్లూరులోని ఫాంహౌస్‌లో అన్నదాతలతో భేటీ అవుతారు. ఈ భేటీ నిమిత్తం 250 మంది రైతుల్ని ఎంపిక చేశారు. ఈ భేటీ ముగియగానే రాహుల్ ఢిల్లీకి బయలు దేరి వెళ్తారు.
నేడు తిరుచ్చికి రాహుల్
Published Thu, Jul 23 2015 2:32 AM | Last Updated on Fri, Aug 17 2018 6:00 PM
Advertisement
Advertisement