సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇద్దరు కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. డీకే. శివ కుమార్‌కు విద్యుత్ శాఖ, ఆర్. రోషన్ బేగ్‌కు ప్రాథమిక సదుపాయాలు, సమాచార, హజ్ శాఖలను కేటాయిస్తూ ఆయన చేసిన సిఫార్సును గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ ఆమోదించారు.
ప్రధాన శాఖల కోసం పట్టు..
రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గంలో కొత్తగా చేరిన డీకే. శివ కుమార్, ఆర్. రోషన్ బేగ్ మొదట ప్రధాన శాఖలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వీరిద్దరూ బుధవారం సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బేగ్ తనకు వక్ఫ్ శాఖ కావాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఖమరుల్ ఇస్లాం ఆ శాఖను నిర్వహిస్తున్నారు. ఈ శాఖను బేగ్‌కు ఇచ్చేది లేదంటూ ఆయన తెగేసి చెప్పడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపై గురువారం మధ్యాహ్నం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ నివాసంలో దాదాపు గంట సేపు పంచాయతీ జరిగింది.
ఇందులో పాటిల్, ఖమరుల్ ఇస్లాంలతో పాటు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర, వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాశ్ పాటిల్ పాల్గొన్నారు. బేగ్‌కు వక్ఫ్ శాఖను ఇవ్వడానికి సమ్మతించాలని అందరూ ఖమరుల్ ఇస్లాంపై ఒత్తిడి తెచ్చారు. దీనిక ఆయన ససేమిరా అన్నట్లు సమాచారం. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ కూడా తన శాఖ పట్ల అసంతృప్తితో ఉండడంపై ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. మరో మంత్రి డీకే. శివ కుమార్ కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరను గురువారం సదాశివ నగరలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
శివ కుమార్ సైతం ప్రధాన శాఖను కోరుకున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి వద్ద అనేక ప్రధాన శాఖలున్నాయి. రెవెన్యూ, ప్రజా పనులు, సహకారం లాంటి కీలక శాఖలను సీఎం, జనతా దళ్‌లో తనతో ఉన్న అనుయాయులకు ఇచ్చారు. దీనిపై ఆది నుంచీ కాంగ్రెస్‌లో ఉంటున్న వారిలో అసంతృప్తి నెలకొంది. అందుకే... శాసన సభ లోపల, బయటా ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై ‘దాడి’ చేసే సందర్భాల్లో వారెవరూ ఆయనకు అండగా నిలబడడం లేదు.
నూతన అమాత్యులకు శాఖల కేటాయింపు
Published Fri, Jan 3 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement