కలైంజర్ డీఎంకే!
కలైంజర్ డీఎంకే!
Published Mon, Mar 17 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
మదురైలో ఆదివారం పోస్టర్లు కలకలం రేపాయి. డీఎంకే వర్గాల్లో గుబులు పుట్టించే రీతిలో హంగామా సృష్టిస్తూ వీటిని అళగిరి మద్దతుదారులు సిద్ధం చేశారు. డీఎంకేను చీలుస్తూ కలైంజర్ డీఎంకే పేరిట పార్టీ ఆవిర్భావం అన్న నినాదాలను అందులో పొందు పరచడం చర్చకు దారి తీస్తున్నది. ఈ తంతు ఓ వైపు ఉంటే మరో వైపు సోమవారం తన మద్దతుదారులతో మంతనాలకు అళగిరి సిద్ధం అయ్యారు.
సాక్షి, చెన్నై:డీఎంకే నుంచి అళగిరిని బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ తనను దూరం పెట్టినా, కలైంజర్ కరుణానిధి మాత్రం తన నాయకుడంటూ అళగిరి చెప్పుకొస్తున్నారు. కరుణానిధిని తప్ప మరొకరిని నాయకుడిగా అంగీకరించబోనని స్పష్టం చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో గత 15 రోజులుగా అళగిరి వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే పతనం తప్పదని బల్ల గుద్ది మరీ ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం తన సత్తాను చాటుతానని హెచ్చరికలు చేస్తూ వచ్చిన అళగిరి గత వారం మీడియాకు చిక్కారు. పార్టీ పెట్టబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా లేదని సమాధానం ఇచ్చిన ఆయన తన మద్దతుదారుల అభీష్టమే తన నిర్ణయంగా ప్రకటించారు. జాతీయ స్థాయి నేతలతోపాటు, దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్‌తో ఆయన భేటీ కావడంలో ఆంతర్యమేమిటోనన్న ప్రశ్న బయలు దేరింది. రజనీ కాంత్‌తో భేటీ అనంతరం ఈనెల 17న మద్దతుదారులతో భేటీ కాబోతున్నట్టు, అందులో తీసుకునే నిర్ణయం మేరకు లోక్‌సభ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికోనన్నది ప్రకటిస్తానని అళగిరి స్పష్టం చేశారు.
ఏర్పాట్లు: మద్దతుదారులతో భేటీకి అళగిరి నిర్ణయించడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మదురైలో ఓ కల్యాణ మండపం వేదికగా సోమవారం మద్దతుదారులను కలుసుకునేందుకు అళగిరి సిద్ధం అయ్యారు. ఇందులో అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. మీడియూ అంతా మదురై వైపు చూస్తున్నది. అదే సమయంలో అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, తమకు ఎలాంటి ఢోకా లేదని డీఎంకే వర్గాలు పైపైకి చెబుతున్నా, లోలోపల అళగిరి కార్యచరణపై నిఘా వేసి ఉన్నాయి. ఈ సమయంలో ఏకంగా పార్టీ పెట్టేద్దామని పిలుపునిస్తూ అళగిరి మద్దతుదారులు మదురైలో ఆదివారం హల్‌చల్ సృష్టించారు.
పోస్టర్ల కలకలం: సోమవారం మద్దతుదారులతో అళగిరి మంతనాలకు సిద్ధం అవుతున్న సమయంలో ఆదివారం మదురైలో పోస్టర్లు కలకలం సృష్టించాయి. డీఎంకేను రెండుగా చీలుస్తూ, కలైంజర్ డీఎంకే పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి. పార్టీని, జెండాను ప్రకటిచేద్దాం...లోక్ సభ ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలబెట్టేద్దామన్న నినాదంతో వెలసిన ఈ పోస్టర్లపై డీఎంకే వర్గాలు దృష్టి కేంద్రీకరించారుు. కేవలం తమను బెదిరించేందుకు ఈ పోస్టర్లు వెలిశాయూ లేదా, అళగిరి పార్టీ పెట్టే నిర్ణయంతో ఉన్నారా..? అనే అన్వేషణలో మదురై డీఎంకే నాయకులు తలమునకలై ఉన్నారు. మద్దతుదారుల అభీష్టం మేరకు పార్టీ నిర్ణయం ఉంటుందని అళగిరి ఇప్పటికే స్పష్టం చేసిన దృష్ట్యా, తాజాగా వెలసిన పోస్టర్లపైఅ ళగిరి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Advertisement