మదురైలో ఆంధ్రులపై దాడి
Published Thu, Aug 22 2013 1:17 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి : మదురై జిల్లా మేలూరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదిమందిపై మంగళవారం రాత్రి స్థానికులు దాడి చేశారు. క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానంతో స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో 55 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మేలూరు సమీపంలోని సిట్రరువిపట్టి అనే ప్రాంతంలో అళగర్ ఆలయం కొండ కింది ప్రాంతంలోని వెల్లిమలై మురుగన్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదిమంది వచ్చారు. స్థానిక ప్రజలకు అన్నదానం చేశారు. సాయంత్రం రాగిరేకులు పెట్టి పూజలు చేశారు.
ఆ తర్వాత మళ్లీ అన్నదానం చేశారు. అదేరోజు అర్ధరాత్రి పూజలు ప్రారంభించారు. వీరి పూజలను అనుమానించిన గ్రామపెద్ద ఊరిలో ప్రచారం చేశారు. దీంతో సుమారు 60 మందికి పైగా స్థానికులు అక్కడికి చేరుకుని వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధామ, రెవరెండ్, కేశవ్, రేణు, ప్రవీణ్‌కుమార్, శ్రీరాము, రాజ్, సందు, స్వామి, వెంకటస్వామి, మేలూరు సమీపంలోని వల్లాలపట్టికి చెందిన సోమసుందరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీరిలో కేశవ్‌కు చెందిన సూట్‌కేసులో మలేషియా, అండమాన్‌కు రానుపోను విమానం టికెట్లు కనుగొన్నారు. వారి తీరును బట్టి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తలుగా అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మేలూరు ఇన్‌స్పెక్టర్ అవుడయ్యప్పన్ దాడికి పాల్పడిన శశికుమార్, సత్యమూర్తి, సెంథిల్, పెరియకుళియన్, మాయాండి తదితర 55 మందిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.
Advertisement
Advertisement