మట్కా నిర్వాహకుడిని అరెస్ట్ చేయడానికి ప్రైవేట్ వాహనంలో వచ్చిన ఆంధ్రప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులపై తాలూకాలోని జిలాచర్ల గ్రామ ప్రజలు దాడి చేశారు.
బాగేపల్లి. మట్కా నిర్వాహకుడిని అరెస్ట్ చేయడానికి ప్రైవేట్ వాహనంలో వచ్చిన ఆంధ్రప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులపై తాలూకాలోని జిలాచర్ల గ్రామ ప్రజలు దాడి చేశారు. సంఘటనలో జీపు ధ్వంసమైంది. బాగేపల్లి పోలీసుల సమాచారం మేరకు... జిలాచర్ల గ్రామానికి చెందిన బుజ్జి మట్కా నిర్వాహకుడిగా పేరుగాంచాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురము జిల్లాలోనూ ఇతను అనైతిక వ్యాపారాన్ని విస్తరింపజేశాడు. అసాంఘిక కార్యకలాపాల నివారణలో భాగంగా అనంతపురము జిల్లా పెనుగొండ డీఎస్పీ ఆధ్వర్యంలో హిందూపురం రెండవ పట్టణ ఎస్‌ఐ ఆంజనేయులుతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఓ హెడ్ కానిస్టేబుల్ టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి బుజ్జిను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సుమారు 9.30 గంటలకు ఓ ప్రైవేట్ సుమో వాహనం(ఏపీ 02-ఎన్ 0459)లో టాస్క్‌ఫోర్స్ జిలాచర్లకు చేరుకుంది. బుజ్జిని అరెస్ట్ చేసి తమతోపాటు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కుటుంబసభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఆ సమయంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై మఫ్టీలో వచ్చిన వారు దొంగలై ఉంటారని భావించి వారి చెర నుంచి బుజ్జిని విడిపించారు. ఆ సమయంలో గొడవ చోటు చేసుకుని టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై దాడి చేశారు. వారు వచ్చిన జీపు అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న గ్రామ పెద్దలు అక్కడకు చేరుకుని దాడిని నివారించి, విషయాన్ని బాగేపల్లి పోలీసులకు చేరవేశారు. దీంతో బాగేపల్లి సీఐ సి.వసంత్, సిబ్బంది అక్కడకు చేరుకుని టాస్క్‌ఫోర్స్ పోలీసులను విడిపించి, బాగేపల్లికి పిలుచుకువచ్చారు.
అప్పటికే విషయాన్ని తెలుసుకున్న హిందూపురం పోలీసులు పెద్ద ఎత్తున బాగేపల్లి చేరుకున్నారు. ఎస్‌ఐ ఆంజనేయులు ఫిర్యాదు మేరకు 17 మందిపై కేసు నమోదు చేశారు. సంఘటనకు సంబంధించి నరసింహప్ప, నాగరాజు, నరసింహప్పను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దాడిలో గాయపడిన వారిలో ఎస్‌ఐ ఆంజనేయులు, కానిస్టేబుళ్లు నరేష్, రవి, మల్లికార్జున, నరేష్‌బాబు, లోకేష్‌కుమార్ ఉన్నారు.