మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్ వద్ద సావిత్రి నదిపై ఉన్న వంతెన కొట్టుకుపోయిన ఘటనలో గాలింపుబృందాలు శుక్రవారం మరో మూడు మృతదేహాలను వెలికితీశాయి. దీంతో ఇంతవరకు లభించిన మృతదేహాల సంఖ్య 17కు చేరింది. బ్రిటిష్ కాలం నాటి ఈ వంతెన వరద ధాటికి కొట్టుకు పోవడంతో రెండు ఆర్టీసీ బస్సులతో పాటు అనేక ప్రైవేటు వాహనాలు నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.
వెలికి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి పంపించినట్లు అదనపు పోలీస్ సూపరింటెండెంట్ సంజయ్ పాటిల్ తెలిపారు. 20 బోట్లు, 160 మంది కోస్టుగార్డ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చేపడుతున్నాయని పాటిల్ చెప్పారు. గాలింపు చర్యల్లో నది భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉన్న స్థానిక మత్స్యకారుల సహాయాన్ని కూడా తీసుకుంటున్నామన్నారు. ఘటనా స్థలానికి 120 కిలోమీటర్ల దూరంలో కొన్ని మృతదేహాలు లభ్యమైనట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.