నాలుగు రాష్ట్రాలకూ పంచాలి
♦ కృష్ణా నదీజలాలపై ఏపీ ప్రభుత్వ వాదన
♦ రాష్ట్రాలకు సరిహద్దులు ఉంటాయి, నదులకు కాదు
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీజలాలను నాలుగు రాష్ట్రాలమధ్య కేటాయింపులు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ మంగళవారం వాదనలు కొనసాగిస్తూ.. రాష్ట్రాలకు రాజకీయంగా సరిహద్దులుండవచ్చునని, అయితే కృష్ణా నది విస్తీర్ణం, సరిహద్దుల్లో ఏమాత్రం మార్పులుండవని పేర్కొన్నారు. అందువల్ల కృష్ణా నదిని ఒకే హైడ్రోలాజికల్ యూనిట్‌గా పరిగణించి, రాష్ట్రాలమధ్య నీటి కేటాయింపులు చేసే బాధ్యత ట్రిబ్యునల్‌పై ఉందన్నారు. ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, వాటికింద నిల్వ అవుతున్న నీరు, నదిలో నీటిలభ్యతలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారానే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు సాధ్యమవుతాయని చెప్పారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రత్యేకతను వివరిస్తూ గతంలో రాష్ట్రాల విభజన సమయంలో చేసిన చట్టాలను గంగూలీ ప్రస్తావించారు. గతంలో కొత్తగా రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు వాటిమధ్య నీటి పంపిణీని కేంద్రప్రభుత్వమే నిర్ణయించిందని, సెక్షన్ 89 తరహా వివరణ ఎక్కడా లేదని ఆయన అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఉనికిలో ఉన్నందున నీటి కేటాయింపుల బాధ్యతను ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పజెప్పిందన్నారు. నీటి పంపకాల్ని తెలంగాణ, ఏపీలకు పరిమితం చేయాలని కేంద్రం భావించలేదని, అందువల్లే సెక్షన్ 89ని చట్టంలో చేర్చారని ఆయన పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాలకు ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులతోపాటుగా నీటి ప్రవాహం, లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఏవిధంగా వినియోగించాలో తెలియచేసే ఆపరేషన్ ప్రోటోకాల్‌ను కూడా ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాలమధ్య నీటి వివాదాలు రాకుండా చూడడానికే సెక్షన్ 89ని విభజన చట్టంలో చేర్చారన్నారు. ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలమధ్య కృష్ణా జలాల్ని బచావత్ ట్రిబ్యునల్, తర్వాత బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గుండుగుత్తగా కేటాయింపులను చేశాయని, అందువల్లే ఆల్మట్టి విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్పి వచ్చిందని చెప్పారు. ట్రిబ్యునల్ ముందు బుధవారం మహారాష్ట్ర, కర్ణాటకలు వాదనలు కొనసాగించనున్నాయి.