‘యాప్’లలో పవిత్ర ‘ఖురాన్’ గ్రంథం
రంజాన్ మాసంలో పెరుగుతున్న వినియోగదారులు
అరబిక్, తెలుగుతో పాటు మరిన్ని భాషల్లో దివ్య ‘ఖురాన్’ యాప్‌లు
బెంగళూరు: ఆధ్యాత్మికత ఆధునిక సాంకేతిక సొబగులను అద్దుకుంటోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.. పవిత్ర ‘ఖురాన్’ గ్రంథాన్ని యాప్‌ల రూపంలో స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. రంజాన్ మాసం సందర్భంగా ప్రస్తుతం ఈతరహా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఐటీ నగరిగా ప్రఖ్యాతి గాంచిన బెంగళూరు నగరంలో ‘ఖురాన్’కు సంబంధించిన కొన్ని యాప్‌లకు 10వేలకు పైగా డౌన్‌లోడ్‌లు నమోదవుతున్నాయి. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో పాటు ఖురాన్ పఠనానికి సైతం ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఉద్యోగులుగా ఉన్న వారు, ఇతర విధుల నిర్వహణలో ఉన్న వారికి ఖురాన్ పఠనానికి అవసరమైన సమయాన్ని కేటాయించడం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో విధులను నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక మార్గంలో కూడా కొనసాగేందుకు వీలుగా యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.
ఈ యాప్‌లలో దివ్య ‘ఖురాన్’తో పాటు ‘దువా’, ‘హదీస్’, ‘మహమ్మద్ ప్రవక్త(స) జీవిత విశేషాలతో కూడిన కథలు’ కూడా పొందుపరచబడి ఉన్నాయి. ‘ఖురాన్’ను చదవడమే కాదు, వినగలిగేలా ఆడియో పొందుపరిచిన యాప్‌లు సైతం ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. అరబిక్ భాషలోనే కాకుండా తెలుగు, కన్నడ, బెంగాళీ తదితర భాషల్లో సైతం ఈ యాప్‌లలో దివ్య ‘ఖురాన్’అందుబాటులో ఉంది. ‘ఐఖురాన్’, ‘అల్ ఖురాన్’ వంటి అనేక యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక దివ్య ‘ఖురాన్’ పఠనం కోసం తాను ‘ఐఖురాన్’ యాప్‌ను వినియోగిస్తున్నానని నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్న తబస్సుమ్ చెబుతున్నారు. ‘మేము యశ్వంతపుర ప్రాంతంలో నివసిస్తున్నాం. పనిచేస్తున్న ఆఫీసు సర్జాపురలో ఉంది. రోజుకు నాలుగు గంటలు ఆఫీసు బస్సులో ప్రయాణం చేస్తాను. ఈ నాలుగు గంటల కాలంలో పవిత్ర ‘ఖురాన్’ గ్రంధాన్ని పఠించేందుకు నిర్ణయించుకొని ‘ఐఖురాన్’ యాప్‌ను నా స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నాను. నా స్నేహితులు కూడా చాలా మంది ప్రస్తుతం ఈ తరహా యాప్‌లలోనే పవిత్ర ‘ఖురాన్’ గ్రంథాన్ని పఠించడంతో పాటు మహమ్మద్ ప్రవక్త(స) జీవిత విశేషాలను తెలుసుకోగలుగుతున్నారు. ‘దివ్య ఖురాన్’ పేరిట ఉన్న యాప్‌లో పవిత్ర ‘ఖురాన్’ గ్రంథం కన్నడ భాషలో సైతం అందుబాటులో ఉంది’ అని చెప్పారు.